మహిళల ఫిర్యాదుల కోసం రహస్య గ్లాస్ గదులు 

మహిళల నుండి ఫిర్యాదుల సేకరణ కోసం పోలీస్ స్టేషన్ లలో రహస్య గ్లాస్ గదులు ఏర్పాటు చేయాలని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. 
 
హత్రాస్, బల్‌‌రాంపూర్ సామూహిక అత్యాచారం ఘటనలపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం కావడంతో మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తూ ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మిషన్ శక్తి అనే కార్యక్రమం ప్రారంభించడం తెలిసిందే.
 
ఈ కార్యక్రమంలో భాగంగా అన్ని పోలీసు స్టేషన్లలో రహస్య  గ్లాస్ రూమ్‌‌లు ఏర్పాటు చేయనున్నట్లు యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. రాష్ట్రంలోని 1,535 పోలీసు స్టేషన్లలో మహిళల హెల్ప్ డెస్క్‌‌ను ఆదిత్యనాథ్ శుక్రవారం ప్రారంభించారు. 
 
ఈ హెల్ప్ డెస్కుల్లో సీసీటీవీ కెమెరాలు, కంప్యూటర్‌‌‌తోపాటు పోలీసు అధికారులు, ఫిర్యాదుదారుల కోసం సీట్లను ఏర్పాటు చేశారు. అందరూ మహిళలను గౌరవించాలని ఆయన స్పష్టం చేశారు. 
 
రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యా సంస్థల్లో మిషన్ శక్తి కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు యోగి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలు, యువతులకు ఆత్మరక్షణ వ్యూహాలతో శిక్షణ ఇవ్వడం జరుగుతోందని తెలిపారు. 
 
మహిళలు, బాలలపై ఎక్కడ నేరాలు జరిగినా సీనియర్ పోలీస్ అధికారులు స్వయంగా సంఘటన స్థలాలకు చేరుకొని దర్యాప్తు త్వరితగతిన పూర్తయ్యేటలంటూ చూడాలని సీఎం ఆదేశించారు.