జల వివాదాలలో తలమునకలైన తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు బస్సులు నడపడంలో సహితం ఒక నిర్ణయానికి రాలేక పోవడంతో పండుగ సెలవులకు సహితం పరస్పరం బస్సుల రాకపోకలకు వీల్లేకుండా పోతున్నది. తెలుగు రాష్ట్రాల్లో సరిహద్దుల వరకే బస్సులు నడుస్తాయని ఏపీ రవాణా శాఖా మంత్రి పేర్నినాని స్పష్టం చేశారు.
సరిహద్దుల్లో చెక్ పోస్టుల వద్ద బస్సులు విరివిగా అందుబాటులో ఉంచుతున్నామని చెబుతూ తెలంగాణతో చర్చలు కొలిక్కి రానందుకే ఈ పరిస్థితి ఏర్పడిందని ధ్వజమెత్తారు. మంగళవారం మరోసారి చర్చలు జరిపే అవకాశం ఉందని పేర్నినాని పేర్కొన్నారు.
తెలంగాణలో స్థిరపడిన వారు దసరాకు ఏపీలోని స్వస్థలాలు, బంధువుల వద్దకు వెళ్లేందుకు చూస్తున్నారని చెప్పారు. ప్రజల అవసరాల మేరకు బస్సులు నడపాలని భావించినప్పటికీ తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం ఇంకా కుదరనందువల్ల అది సాధ్యపడలేదని పేర్కొన్నారు.
ఏపీ-తెలంగాణ సరిహద్దుల వద్ద ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంచామని చెప్పారు. కర్నూలు సమీపంలోని పంచలింగాల, గరికపాడు,వాడపల్లి, పైలాన్, జీలుగుమిల్లి, కల్లుగూడెం చెక్‌పోస్టు వద్ద బస్సులు ఉంటాయని తెలిపారు. ప్రయాణికులు సరిహద్దు వద్దకు వస్తే చెక్‌పోస్టుల వద్ద విరివిగా బస్సులు అందుబాటులో ఉంచామని చెబుతూ ఆ మేరకు ఆంధ్రా సరిహద్దు వరకు బస్సులు నడపాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరామని వెల్లడించారు.
కాగా, ఆంధ్రప్రదేశ్ నుంచి కర్ణాటక, తమిళనాడుకు బస్సుల పునరుద్ధరణ ఇప్పటికే జరిగిందని, తెలంగాణలో సర్వీసులు నడిపేందుకు జూన్ 18 నుంచి అక్కడి అధికారులతో ఏపీ అధికారులు చర్చిస్తున్నారని మంత్రి వెల్లడించారు.
కనీసం పండగ వరకైనా బస్సులు నడపాలని తెలంగాణ అధికారులను కోరామని, వరుసగా మూడు రోజులు సెలవులు కావడంతో జాప్యమైందని మంత్రి పేర్ని నాని చెప్పారు. ఏపీఎస్ ఆర్టీసీ లాభ నష్టాల కోసం చూడట్లేదని, ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తామని తెలిపారు.
More Stories
సినీ నటి జేత్వాని వేధింపుల కేసులో ముగ్గురు ఐపీఎస్‌లపై వేటు
ఏడాదిలోగా గన్నవరంలో ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్
కాదంబరీ జత్వానీ కేసులో ఏసీపీ, సీఐ సస్పెండ్