వరదలు, భారీ వర్షాలతో తెలంగాణాలో రూ 9,422 కోట్ల మేరకు నష్టం వాటిల్లిన్నట్లు ప్రాధమిక అంచనాను రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు రెండు రోజుల పర్యటనకు వచ్చిన అంతర్- మంత్రివర్గ కేంద్ర బృందంకు తెలిపారు. రాష్ట్రంలో మౌళిక వసతులకు భారీగా నష్టం జరిగిందని చెబుతూ పంట నష్టం రూ.8633 కోట్లు కాగా, రహదారులకు రూ.222 కోట్లు, జిహెచ్‌ఎంసికి సుమారు రూ.567 కోట్ల నష్టం వాటిల్లిందని అధికారులు పేర్కొన్నారు.
కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి ప్రవీణ్ వశిష్ట నాయకత్వంలో వచ్చిన ఈ బృందం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, ఇతర శాఖల ఉన్నతాధికారులతో భేటి అయింది. రాష్ట్రంలో వరదల పరిస్థితి, తలెత్తిన నష్టం, చేపడుతున్న సహాయక చర్యలపై రాష్ట్ర అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు.
గత పది రోజులుగా రాష్ట్రంలో అత్యధిక వర్షాల వలన హైదరాబాద్, పరిసర జిల్లాలో భారీ ఎత్తున నష్టం వాటిల్లిందని తెలియజేశారు. మూసీనదికి వరదముంపు ఏర్పడడంతో పాటు నగరంలో మూడు చెరువులకు గండిపడిందన్నారు. ఫలితంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయని అధికారులు వెల్లడించారు.
సమావేశం అనంతరం వారు రెండు బృందాలుగా విడిపోయి రాష్ట్రంలో వరద పరిస్థితిని అధ్యయనం చేశారు. ముగ్గురు సభ్యులు గల కేంద్ర బృందం ముందుగా పాతబస్తీ చాంద్రాయణ గుట్ట పల్లె చెరువు, ఇతర వరద ముంపు ప్రాంతాలను సందర్శించారు.
మరో ఇద్దరు సభ్యుల బృందం సిద్దిపేట్ జిల్లాలోని ములుగు మండలానికి వెళ్ళి అక్కడ వరద నష్టాన్ని పరిశీలిస్తోంది. జిల్లాల్లో పంట నష్టాన్ని కూడా అంచనా వేస్తోంది. రెండు రోజుల పర్యటన తరవాత రాష్ట్రంలోని వరద పరిస్థితిపై కేంద్రానికి ఐదుగురు సభ్యుల కేంద్ర బృందం నివేదిక ఇవ్వనుంది.
More Stories
ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం పూర్తి
ఒకవైపు ప్రజాపాలన దినోత్సవాలు.. మరోవైపు విముక్తి దినోత్సవాలు
రికార్డు స్థాయిలో బాలాపూర్ లడ్డుకు రూ 30 లక్షల ధర