డెమోక్రాటిక్ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్‌ను దుర్గాదేవిగా మార్ఫింగ్ చిత్రాన్ని ఆమె మేనకోడలు ట్వీట్ చేయడంతో అమెరికాలోని హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా చిత్రాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేసిన మీనా హారిస్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి.
హిందూ సంఘాలు అనుచితమంటూ వ్యాఖ్యానించడంతో ఆ ట్వీట్‌ను మీనా హారిస్ తొలగించారు. “దుర్గామాత వ్యంగ్య చిత్రాలతో కమలా హారిస్ మార్ఫింగ్ ఫొటో ప్రపంచవ్యాప్తంగా చాలా మంది హిందువులను తీవ్రంగా క్షోభకు గురిచేసింది” అని హిందూ అమెరికన్-ఫౌండేషన్‌కు చెందిన సుహాగ్ ఏ శుక్లా ట్వీట్‌లో పేర్కొన్నారు.
హిందూ అమెరికన్ సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తున్న హెచ్‌ఏఎఫ్, మతానికి సంబంధించిన చిత్రాలను వాణిజ్యపరంగా ఉపయోగించటానికి మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇలాంటి అప్రియమైన చిత్రాన్ని మీనా హారిస్ స్వయంగా సృష్టించలేదు. ఆమె ట్వీట్‌కు ముందే ఇది వాట్సాప్‌లో సర్క్యులేట్ అయిందని హిందూ అమెరికన్ పొలిటికల్ యాక్షన్ కమిటీకి చెందిన రిషి భుటాడా చెప్పారు.
అయినప్పటికీ మీనా హారస్ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని తాను వ్యక్తిగతంగా నమ్ముతున్నానని తెలిపారు. హిందూ మతపరమైన ప్రతిమలను అమెరికా రాజకీయ సేవల్లో ఉపయోగించకూడదనే చెప్తున్నాను అని భుటాడా తెలిపారు.
మీనా హారిస్ చిత్రం హిందూ సమాజాన్ని కించపరిచిందని, తీవ్ర ఆగ్రహాన్ని కలిగించిందని అమెరికన్ హిందువులకు వ్యతిరేకంగా పరువు నష్టం కన్వీనర్ అజయ్ షా ఒక ప్రకటనలో చెప్పారు.
మీనా హారిస్ పోస్ట్ చేసిన చిత్రంలో.. దుర్గాదేవిగా కమలా హారిస్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను గేదె భూతం ‘మహిషాసుర’ గా చిత్రీకరించారు. డెమోక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్‌ను అమ్మవారి వాహనం సింహంగా చూపించింది.
హిందువులను ఎగతాళి చేయడం ద్వారా మా ఓట్లను గెలుచుకోబోతున్నట్లు మీరు భావిస్తే.. మరోసారి ఆలోచించుకోండి అని ప్రముఖ రచయిత షెఫాలి వైద్య ట్వీట్ చేశారు. మీ చిత్రం హిందువులను అవమానపరిచేదిగా ఉన్నదని, మా దైవాన్ని ఎగతాళి చేయడం సాంస్కృతిక ఉత్సుకత కాదని స్పష్టం చేశారు. క్షమాపణ చెప్పకుండా ట్వీట్‌ను తొలగించడం ఏంటి? అని షెఫాలి వైద్య ప్రశ్నించారు.
More Stories
వేదాలు భౌతిక, ఆధ్యాత్మిక జ్ఞానపు నిధి
బెంగాల్ పోలీసుల నిర్లక్ష్యంతో కీలక ఆధారాలు నాశనం
మోదీ పుట్టిన రోజుకు బిజెపి కార్యకర్తలకు `ప్రజాస్వామ్య తోఫా’