ఉగ్రవాదులందరూ మదర్సాల్లో పెరిగారు   

ఉగ్రవాదులందరూ మదర్సాల్లో పెరిగారని, జమ్ముకశ్మీర్‌ను ఉగ్రవాద కర్మాగారంగా మార్చారని మధ్య ప్రదేశ్ సాంస్కృతిక మంత్రి ఉషా ఠాకూర్ తీవ్ర ఆరోపణలు చేశారు. గతంలో కూడా ఉషా ఠాకూర్‌ గార్భేకు ముస్లింలను అనుమతించవద్దని, కన్హయ్యకు ఆయన తల్లి దేశభక్తిని నూరిపోయలేదని వంటి వాఖ్యలతో రాజకీయ కలకలం రేపారు.
`పిల్లలందరికీ సమాన విద్య ఇవ్వాలి. మతం ఆధారిత విద్య మూర్ఖత్వాన్ని వ్యాప్తి చేస్తున్నది. ద్వేషం వ్యాప్తి చెందుతుంది. జాతీయవాదంతో సమాజంలోని ప్రధాన స్రవంతితో అనుసంధానించలేని మదర్సాలు, మనం వారిని సరైన విద్యతో అనుసంధానించాలి. ప్రతి ఒక్కరి పురోగతి కోసం సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాలి’ అని ఉషా ఠాకూర్‌ ఉపఎన్నికల ప్రచారం సందర్భంగా పేర్కొన్నారు.
అంతటితో ఊరుకోకుండా జాతీయ ప్రయోజనాలకు అడ్డుపడే మదర్సాలను మూసివేయాలని, అసోంలో ఆ పని చేసి చూపారని ఆమె చెప్పారు. మదర్సాలకు ప్రభుత్వ సహాయం నిలిపివేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఎవరైనా తమ మతపరమైన ఆచారాలను ప్రైవేటుగా ఎవరికైనా ఇవ్వాలనుకుంటే రాజ్యాంగం దానిని అనుమతిస్తుందని ఆమె చెప్పారు.
పాకిస్తాన్‌లో 14 శాతంగా ఉన్న హిందువులు ఇప్పుడు ఒక్క శాతానికే పరిమితమయ్యారని పేర్కొంటూ చిత్రహింసల కారణంగానే హిందువుల జనాభా అంత తక్కువకు చేరుకున్నదని ఆమె ధ్వజమెత్తారు.