హక్కుల సాకుతో చట్ట ఉల్లంఘనను క్షమించలేం 

స్వచ్ఛంద సంస్థలకు విదేశీ నిధులు అందించడంపై ఆంక్షలు, దేశంలో కార్యకర్తలను అరెస్ట్‌ చేయడం తగదని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషనర్‌ మిచెల్‌ బాచెలెట్‌ ఆందోళన వ్యక్తం చేయడాన్ని భారత్‌ ఖందించింది. 

మానవ హక్కుల సాకుతో చట్ట ఉల్లంఘనను క్షమించలేమని స్పష్టం చేసింది.  ఈ విషయంపై మరింత సమాచారం కావాలని పేర్కొంది. భారత్‌ ప్రజాస్వామ్య ప్రభుత్వ పాలనను స్వతంత్ర న్యాయవ్యవస్థను కలిగి ఉందని విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాస్తవ గుర్తు చేశారు. 

విదేశీ సహకార నియంత్రణ చట్టం (ఎఫ్‌సిఆర్‌ఎ)కి సంబంధించిన అంశంపై ఐక్యరాజ్యసమితి మానవహక్కుల హైకమిషనర్‌ వ్యాఖ్యలను చూశామని చెప్పారు. చట్టాల రూపకల్పన సార్వభౌమ హక్కు అని, చట్ట ఉల్లంఘనలను మానవహ క్కుల నెపంతో క్షమించలేమని తేల్చి చెప్పారు. 

ఈ విషయం గురించి మరింత సమాచారం ఐక్యరాజ్యసమితి నుండి ఆశిస్తున్నామని శ్రీవాస్తవ పేర్కొన్నారు. కాగా, మిచెల్‌ మాట్లాడుతూ భారతదేశం చాలాకాలంగా బలమైన పౌర సమాజాన్ని కలిగి ఉందని, మానవహక్కుల వాదనలో ప్రపంచవ్యాప్తంగా ముందంజలో ఉందని కొనియాడారు.