పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ అసమర్థుడని, బుద్ధిహీనుడని, వెంటనే పదవి నుండి వైదొలగాలని అంటూ ఆ దేశంలోని ప్రతిపక్షాలు సింహగర్జన చేశాయి. ఆయన పాలన నియంతృత్వం కంటే దారుణంగా ఉన్నదని మండిపడ్డాయి.
ఇమ్రాన్ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు పాకిస్థాన్ డెమొక్రటిక్ అలయన్స్ పేరిట కూటమిగా ఏర్పడిన 11 విపక్ష పార్టీలు దేశవ్యాప్తంగా ఉద్యమం చేపడుతున్నాయి. ఇందులో భాగంగా కరాచీలో రెండో భారీ సభను నిర్వహించాయి.
ఈ సందర్భంగా పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ అధినేత, మాజీ ప్రధాని బెనజిర్ భుట్టో కుమారుడు బిలావల్ భుట్టో జర్దారీ మాట్లాడుతూ ఎంతో మంది నియంతలు చరిత్రలో కలిసిపోయారని, ఈ కీలుబొమ్మ సర్కార్ ఏం నిలబడగలదని ప్రశ్నించారు. తమది నిర్ణయాత్మక పోరు అని చెప్పారు.
“నీవు ప్రజల నుండి ఉద్యోగాలు లాక్కున్నావు, వారి రెండు పూటలా ఆహారం లేకుండా చేసావు” అంటూ మూడు పర్యాయాలు ప్రధానిగా పనిచేసిన నవాజ్ షరీఫ్ కుమార్తె మర్యామ్ నవాజ్ నిప్పులు చెరిగారు. ఆ ఉదయం కరాచీ హోటల్ లో ఉన్న ఆమె భర్త మహమ్మద్ స్ఫదర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇమ్రాన్‌ఖాన్ అన్ని విధాలుగా విఫలం అయ్యారని దేశ ప్రతిపక్ష పార్టీల నేతలు విమర్శించారు. దేశానికి సరైన సారథ్యం వహించలేని స్థితిలో ఉన్న ఇమ్రాన్ పదవి నుంచి వైదొలగాలని డిమాండ్ చేశాయి.
ఈ కూటమి దేశంలో ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాన్ని మూడు దశలుగా చేపట్టింది. ఖాన్ నాయకత్వపు పాకిస్థాన్ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ (పిటిఐ) ప్రభుత్వాన్ని తొలిగించేందుకు ఉద్యమకార్యాచరణ పేరిట ప్రతిపక్షాలు రంగంలోకి దిగాయి.
More Stories
ఇజ్రాయిల్ నగరాలపై రాకెట్ల వర్షం
సరిహద్దుల్లోకి డ్రాగన్ డ్రోన్లు.. నిఘా కోసమేనా?
వైద్యశాస్త్రంలో అమెరికా శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం