మాజీ ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు కమల్‌నాథ్ దళిత వర్గానికి చెందిన మంత్రి ఇమార్తి దేవీపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు మధ్య ప్రదేశ్ దుమారం రేపాయి. శివరాజ్ సింగ్ చౌహన్ కేబినెట్‌లో మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న ఇమార్తి దేవీని ‘ఐటమ్’ అని కమల్‌నాథ్ సంబోధించారు.
దీంతో ఒక్కసారిగా ఆయనపై రాజకీయ దాడి మొదలైంది. ఉప ఎన్నికల నేపథ్యంలో ‘దబ్రా’ నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభలో కమల్‌నాథ్ మాట్లాడుతూ ‘‘ఇక్కడి నుంచి సురేశ్ రాజే కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. ఈయన చాలా సాదాసీదా వ్యక్తి. ఆమె లాగా కాదు. ఆమె పేరేమి? నా కంటే మీకే బాగా తెలుసు ఆమె గురించి. ఆమె ఐటమ్’’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఇలా ఓ మహిళా కేబినెట్ మంత్రిపై కాంగ్రెస్ దిగ్గజం కమల్‌నాథ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘ఒక్కసారి షాక్‌కు గురయ్యా. ఓ సీనియర్ రాజకీయ వేత్తగా ఉన్న కమల్‌నాథ్ ఓ మహిళా మంత్రిని అగౌరవపరిచేలా మాట్లాడటం ఏమిటి? ఈ వ్యాఖ్యలు సిగ్గుచేటు. మహిళలను, దళితులను అగౌరవ పరిచేలా వ్యాఖ్యలున్నాయి.’’ అని శివరాజ్ సింగ్ మండిపడ్డారు.
మరోవైపు మంత్రి ఇమార్తి దేవీ మాట్లాడుతూ ‘‘నా తప్పేముంది? ఓ పేద కుటుంబంలో పుట్టడమే తప్పా? నేను దళిత వర్గానికి సంబంధించిన వ్యక్తిని. అందులో నా తప్పేముంది? ఇలాంటి వ్యక్తులకు పార్టీలో స్థానమివ్వకూడదని సోనియా గాంధీని కోరుతున్నా. ఇలాంటి వ్యాఖ్యలు మహిళలపై చేస్తే… మహిళలు ఎలా ముందుకు సాగుతారు?’’ అని మండిపడ్డారు.
ఇమార్తి దేవికి మద్దతుగా బీజేపీ నేత జ్యోతిరాథిత్య సింథియాతో పాటు మరికొంత మంది ఇండోర్‌లో మౌన నిరసన ప్రదర్శన చేపట్టారు. మహిళలను, దళితులను కమల్నాథ్ కించపరిచినట్లు బీజేపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
మార్చి నెలలో జ్యోతిరాధిత్య సింథియాతో సమీపంగా ఉన్న ఇమార్తి దేవితో పాటు మరో 21 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఈ కారణంగానే కమల్‌నాథ్ ప్రభుత్వం కూలింది. అయితే 28 ఎమ్మెల్యే స్థానాలకు నవంబర్ 3వ తేదీన ఉప ఎన్నిక జరగనున్నది. కమల్ వ్యాఖ్యలను ఖండిస్తూ ఇవాళ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ భోపాల్‌లో రెండు గంటల పాటు మౌన ప్రదర్శనలో పాల్గొన్నారు.
More Stories
మంత్రులతో కలిసి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు
భార్యతో సెల్ఫీతోనే మావోయిస్టు చలపతి హతం!
పార్లమెంట్లో ఎన్ఆర్ఐలకు ప్రాతినిధ్యం కల్పించాయి