ఫరూఖ్ అబ్దుల్లాను ప్రశ్నించిన ఈడీ

జమ్ము కశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ నిధుల దుర్వినియోగం స్కామ్‌లో సోమవారం ఈడీ అధికారులు నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూఖ్ అబ్దుల్లా సహా మరికొందరిని ప్రశ్నించారు. 2002 నుంచి 2011 మధ్య కాలంలో జరిగిన స్కామ్‌కు సంబంధించి ఇప్పటికే సీబీఐ చార్జ్‌షీట్ ఫైల్ చేయగా, ప్రస్తుతం ఈడీ మనీలాండరింగ్ నిరోదక చట్టం కింద నిందితులకు నోటీసులు ఇచ్చింది. 

ఈ కేసుకు సంబంధించి ఫరూఖ్ వాదన‌ను ఈడీ అధికారులు నమోదు చేశారు. జమ్ము కశ్మీర్ క్రికెట్ అసోసియేషన్‌కు ఆయన చైర్మన్‌గా ఉన్న సమయంలో స్కామ్ జరగడంతో దీనికి సంబంధించిన బ్యాంకు పత్రాలు, వంటి వాటి గురించి ప్రశ్నించినట్లు తెలుస్తోంది. 

అయితే ఇప్పుడు ఈడీ విచారణ కేవలం తమను రాజకీయంగా వేధించేందుకు మాత్రమే తెరపైకి వచ్చిందని ఫరూఖ్ అబ్దుల్లా కుమారుడు జమ్ము కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ఆరోపించారు. జమ్ము కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దుపై పోరాటం చేసేందుకు అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఒక కూటమిగా ఏర్పాటు చేసినందుకే ఈడీ ప్రవేశించిందని అంటూ ఆయన ట్వీట్ చేశారు. 

జమ్ము కశ్మీర్ క్రికెట్ అసోసియేషన్‌కు 2002 నుంచి 2011 మధ్య బీసీసీఐ రూ.113 కోట్ల నిధులను ఇచ్చింది. జమ్ము కశ్మీర్ లోయలో క్రికెట్‌ను ప్రమోట్ చేసేందుకు ఈ నిధులను ఖర్చు చేయాలని సూచించింది. అయితే ఆ మొత్తంలో రూ.43.69 కోట్ల నిధులను దారిమళ్లించి దుర్వినియోగం జరిగిందని ఆరోపణలు వచ్చాయి.

ఈ సొమ్మును స్కామ్ జరిగిన సమయంలో జమ్ము కశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న ఫరూఖ్ అబ్దుల్లా సహా పలువురు ట్రెజరీలు కలిసి నిధులను కాజేశారని కేసు నమోదైంది. అయితే దర్యాప్తులో జమ్ము కశ్మీర్ పోలీసులు విఫలం అయ్యారంటూ 2015లో జమ్ము కశ్మీర్ హైకోర్టు ఈ కేసును సీబీఐకి అప్పగించింది.

దీనిపై దర్యాప్తు చేసిన సీబీఐ 2018 జనవరిలో, 2019లో పలు మార్లు ప్రశ్నించింది. రూ.43.69 కోట్ల మేర నిధుల్లో అక్రమాలు జరిగినట్లు 2018లో సీబీఐ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఆ తర్వాత ఈ కేసులో మనీలాండరింగ్ జరిగి ఉండొచ్చని ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది.