ఆర్థిక వ్యవస్థలో ఇంకా ప్రతికూల సంకేతాలు     

దేశ ఆర్థిక వ్యవస్థలో పురోగతి కనిపిస్తున్నా ఇంకా ప్రతికూల సంకేతాలూ ఉన్నాయని బ్రిక్‌వర్క్‌ రేటింగ్స్‌ చెప్తున్నది. కరోనా సంక్షోభంతో భారత జీడీపీ కుదేలైన విషయం తెలిసిందే.

అయితే 6 నెలల తర్వాత వృద్ధి అవకాశాలకు ఊపునిస్తూ తయారీ పీఎంఐ, జీఎస్టీ వసూళ్లు, ప్యాసింజర్‌ వాహన విక్రయాలు, వ్యాపార ఎగుమతులు, పవర్‌ డిమాండ్‌ ఆశాజనకంగా ఉన్నాయని తాజా నివేదికలో బ్రిక్‌వర్క్‌ రేటింగ్స్‌ పేర్కొన్నది.

సెప్టెంబర్‌లో తయారీ పీఎంఐ 56.8గా నమోదైంది. ఆగస్టులో ఇది 52గా ఉన్నది. జీఎస్టీ వసూళ్లు గత నెలలో రూ.95,480 కోట్లుగా ఉన్నాయి. గతేడాది సెప్టెంబర్‌తో పోల్చితే 3.8 శాతం అధికం. ఈ ఏడాది ఆగస్టుతో చూస్తే 10 శాతం ఎక్కువ.

ఇక ప్యాసింజర్‌ వాహన విక్రయాలు 31 శాతం పుంజుకోగా, రైల్వే సరుకు రవాణా రద్దీ 15 శాతం పెరుగుదలను చూపిస్తున్నది. వ్యాపార ఎగుమతులు సైతం 5.3 శాతం వృద్ధి చెందగా, ఇంజినీరింగ్‌ గూడ్స్‌, పెట్రోలియం ఉత్పత్తులు, ఔషధ, రెడీమేడ్‌ దుస్తులకు డిమాండ్‌ కనిపించింది.

విద్యుత్‌ డిమాండ్‌, ఉత్పత్తి కూడా పెరిగాయి. అయినప్పటికీ మూలధన వ్యయం, కీలక రంగాలు, క్రెడిట్‌ డిపాజిట్‌ రేషియోలు ఆందోళనకరంగా ఉన్నాయని పేర్కొన్నది.

జూలై-సెప్టెంబర్‌లో కొత్త ప్రాజెక్టులపై మూలధన వ్యయం ఏకంగా 81 శాతం తగ్గిపోయిందని, ఇది పెట్టుబడుల క్షీణతకు నిదర్శనంగా నిలుస్తున్నదని బ్రిక్‌వర్క్‌ పేర్కొన్నది. 

ఆగస్టులో కీలక రంగాల వృద్ధి కూడా మైనస్‌ 8.5 శాతంగా ఉందని, క్రెడిట్‌-డిపాజిట్‌ నిష్పత్తి సెప్టెంబర్‌ 11తో ముగిసిన 45 రోజుల్లో పడిపోయిందని, స్వర్ణేతర, చమురేతర దిగుమతులు క్రమంగా క్షీణిస్తున్నాయని వివరించింది.

ఈ క్రమంలోనే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత జీడీపీ దాదాపు మైనస్‌ 9.5 శాతంగా ఉండొచ్చని, ఈ జూలై-సెప్టెంబర్‌లో మైనస్‌ 13.5 శాతంగా నమోదు కావచ్చన్నది.