రూ. 122.15 కోట్ల  డెక్కన్‌ క్రానికల్‌ స్థిరాస్తుల జప్తు  

బ్యాంకులకు భారీ మొత్తంలో రుణాలను ఎగ్గొట్టిన డెక్కన్‌ క్రానికల్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌ (డీసీహెచ్‌ఎల్‌)పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) మరోసారి కొరడా ఝళిపించింది. రుణాలను పక్కదారి పట్టించారన్న కేసులో తాజాగా డీసీహెచ్‌ఎల్‌కు చెందిన రూ. 122.15 కోట్ల విలువైన స్థిరాస్తులను జప్తు చేసింది. 
 
మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద ఈ చర్య చేపట్టామని, న్యూఢిల్లీ, హైదరాబాద్‌, గుర్గావ్‌, చెన్నై, బెంగళూరులోని 14 స్థిరాస్తులను జప్తు చేశామని ఈడీ అధికారులు  వెల్లడించారు. 
 
వీటిలో డీసీహెచ్‌ఎల్‌ మాజీ ప్రమోటర్లు టీ వెంకట్రామ్‌రెడ్డి, టీ వినాయక్‌ రవిరెడ్డి ఆస్తులతోపాటు వారు నడుపుతున్న ఓ బినామీ కంపెనీ ఆస్తులు ఉన్నట్టు తెలుస్తున్నది. 
 
ఈ కేసులో డీసీహెచ్‌ఎల్‌ ఆస్తులను జప్తు చేయడం ఇది రెండోసారి. దీంతో ఇప్పటివరకు మొత్తం రూ.264.56 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసినట్టయింది. డీసీహెచ్‌ఎల్‌ దాదాపు రూ.8,180 కోట్లకు బ్యాంకులను మోసగించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నది. 
 
ఈ వ్యవహారంపై 2015లో సీబీఐ బెంగళూరులో దాఖలు చేసిన చార్జిషీట్‌తోపాటు మరో ఆరు ఎఫ్‌ఐఆర్‌లను ఆధారంగా చేసుకుని డీసీహెచ్‌ఎల్‌, ఆ కంపెనీ యాజమాన్యంపై ఈడీ దర్యాప్తు జరుపుతున్నది.