గ్యాస్‌ సిలిండర్‌ సరఫరాకు ఓటీపీ తప్పనిసరి  

ఇకపై వంట గ్యాస్‌ సిలిండర్‌ను ఇంటికి సరఫరా చేసేందుకు ఓటీపీ లేదా ఒకసారి వినియోగించే పాస్‌వర్డ్‌ తప్పనిసరి. నవంబర్‌ నెల నుంచి కొత్త రూల్‌ అమలులోకి రానున్నది. ఈ విధానం కోసం ఆయిల్‌ కంపెనీలు డెలివరీ ప్రామాణిక కోడ్ (డీఏసీ) పేరుతో ఒక కొత్త వ్యవస్థను అందుబాటులోకి తెచ్చాయి.
 
 గ్యాస్‌ సిలిండర్ల చోరీ, వాటిని పక్కదారి పట్టించడం, నిజమైన లబ్ధిదారుడికిగాక మరొకరికి సరఫరా చేయడం వంటివి నియంత్రించడం కోసం ఈ కొత్త విధానాన్ని అమలు చేయనున్నారు. తొలుత వంద స్మార్ట్‌ నగరాల్లో దీనిని అమలు చేసి దేశవ్యాప్తంగా విస్తరించనున్నారు.
 
తెలంగాణలోని వరంగల్, కరీంనగర్, ఏపీలోని విశాఖ, తిరుపతి, కాకినాడ సిటీలు స్మార్ట్ సిటీల కింద ఎంపికై ఉన్నాయి. దానితో ఈ నగరాలలో ముందుగా ఈ విధానం ప్రారంభం అవుతుంది.
 
రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఇప్పటికే దీనిని పైలట్‌ ప్రాజెక్టు కింద అమలు చేస్తున్నారు. దీని ప్రకారం ఒక వ్యక్తి గ్యాస్ సిలిండర్‌ను బుక్‌ చేయగా వారి రిజిస్టర్‌ మొబైల్‌ నంబర్‌కు ఒక కోడ్‌ వస్తుంది. గ్యాస్‌ సిలిండర్‌ డెలివరీ సందర్భంగా సిబ్బందికి ఆ కోడ్‌ను చూపించాల్సి ఉంటుంది. 
 
దీని కోసం తమ మొబైల్‌ నంబర్‌, అడ్రస్‌ను సంబంధిత గ్యాస్‌ సిలిండర్‌ సరఫరా చేసే సంస్థ ద్వారా అప్‌డేట్‌ చేసుకోవాలి. అయితే వాణిజ్య గ్యాస్‌ సిలిండర్లకు ఈ కొత్త విధానం వర్తించదు.