* 5 వారాల్లో 10 క్షీపనుల ప్రయోగం
శత్రు దేశాలకు కునుకు లేకుండా చేసే అత్యాధునిక ఆయుధ వ్యవస్థల తయారీలో భారత్ దూసుకుపోతున్నది. దేశీయ క్షిపణి వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నది. రాబోయే నాలుగైదేండ్లలో భారత్‌కు సమగ్ర క్షిపణి వ్యవస్థను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్టు రక్షణరంగ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) పేర్కొంది.
ఇందులో భాగంగా సమగ్ర హైపర్ సానిక్ క్రూయిజ్ క్షిపణి వ్యవస్థ (హెచ్‌సీఎంఎస్)ను అభివృద్ధి చేస్తున్నట్టు వెల్లడించింది. ప్రపంచంలో అత్యంత వేగంగా ప్రయాణించే బ్రహ్మోస్ సూపర్ సానిక్ క్రూయిజ్ క్షిపణితో పోలిస్తే రెండు రెట్ల కంటే ఎక్కువ వేగంతో ఈ క్షిపణి వ్యవస్థ లక్ష్యాలను ఛేదించగలదు.
వచ్చే నాలుగైదేండ్లలో సీహెచ్‌సీఎంఎస్‌ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయబోతున్నట్టు డీఆర్డీవో చైర్మన్ సతీశ్‌రెడ్డి తెలిపారు. గత నెల 7న ప్రయోగించిన హైపర్ సానిక్ టెక్నాలజీ డిమోన్‌స్ట్రేటర్ వెహికిల్ (హెచ్‌ఎస్‌టీడీవీ) ప్రయోగం విజయవంతమవ్వడంతో హెచ్‌సీఎంఎస్ అభివృద్ధికి మార్గం సుగమమైందని ఆయన తెలిపారు.
శత్రు దేశాల క్షిపణులను, జలాంతర్గాములను ధ్వంసం చేయడానికి నావికా దళం క్రూయిజ్ క్షిపణులను ఉపయోగిస్తుంది. అయితే, లక్ష్యాల పరిధి, సామర్థ్యాన్ని బట్టి వీటిని సబ్‌సానిక్, సూపర్ సానిక్, హైపర్ సానిక్ క్రూయిజ్ క్షిపణులుగా విభజించారు. సామర్థ్యం, వేగం, లక్ష్యాల పరిధి వంటి అంశాలను బట్టి మిగతావాటి కంటే హైపర్ సానిక్ క్రూయిజ్ క్షిపణులు అత్యుత్తమమైనవి.
ఈ క్షిపణులు ధ్వని వేగం కంటే ఎనిమిది రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణించగలవు. గతంలో హైపర్ సానిక్ క్రూయిజ్ క్షిపణి వ్యవస్థకు సంబంధించిన సాంకేతికత అమెరికా, రష్యా, చైనా వద్ద మాత్రమే ఉండేది. అయితే, హెచ్‌ఎస్‌టీడీవీ ప్రయోగం సక్సెస్‌తో హెచ్‌సీఎంఎస్ అభివృద్ధికి కావాల్సిన సాంకేతికత భారత్‌కు కూడా సమకూరినట్లయింది.
అవసరాన్ని బట్టి ఎలాంటి క్షిపణులైనా మోహరించే సామర్థ్యాన్ని భారత్ సంతరించుకుంటున్నదని డీఆర్డీవో చైర్మన్ సతీశ్‌రెడ్డి తెలిపారు. బలగాల అవసరాలకు అనుగుణంగా వివిధ లక్ష్యిత దూరాలను చేధించే క్షిపణుల అభివృద్ధిపై దృష్టిపెట్టామని పేర్కొన్నారు. చైనాతో వివాదం నేపథ్యంలోనే క్షిపణి పరీక్షలు నిర్వహిస్తున్నారన్న వాదనలను కొట్టిపారేశారు.
గత ఐదు వారాల కాలంలో భారత్ దాదాపు పది క్షిపణులను విజయవంతంగా పరీక్షించింది. ఇందులో సూపర్ సానిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ టార్పెడో వెపన్ సిస్టమ్ (స్మార్ట్), శౌర్య, బ్రహ్మోస్, పృథ్వీ, హెచ్‌ఎస్‌టీడీవీ, రుద్రం-1 వంటి కీలకమైన క్షిపణులు ఉన్నాయి.
హైపర్‌సానిక్, బాలిస్టిక్, యాంటీ రేడియేషన్ తదితర వైవిధ్యతలు కలిగిన ఈ క్షిపణులతో భారత రక్షణ వ్యవస్థ మరింత బలోపేతమయ్యిందని రక్షణ రంగ నిపుణులు పేర్కొన్నారు. ముఖ్యంగా సుదూరాల్లోని శత్రు దేశాల జలాంతర్గాములను ధ్వంసం చేయగల సామర్థ్యం ‘స్మార్ట్’ సొంతమని సతీశ్‌రెడ్డి చెప్పారు.
More Stories
6 కొత్త వందే భారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
రెండు రోజుల్లో ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ రాజీనామా
ప్రధాన మంత్రి పదవి అంటే తిరస్కరించా!