ఈ నెల 17 వ తేదీ నుంచి శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది. దేశ రాజధాని ఢిల్లీ నుంచి మెట్రో నగరాలు, పర్యాటక ప్రాంతాలకు శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుస్తాయి. వీటికి ఇవాల్టి నుంచి రిజర్వేషన్లు ఇవ్వాలని రైల్వే శాఖ నిశ్చయించింది.
న్యూఢిల్లీ నుంచి హబీబ్‌గంజ్ మధ్య శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ను నడపడానికి రైల్వే బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రైలు నేటి నుంచి రిజర్వేషన్లు ప్రారంభమయ్యాయి. ఈ రైలు ఏడున్నర నెలల తర్వాత ట్రాక్‌లో పడటం విశేషం. ఈ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడపాలని రైల్వే శాఖ నిర్ణయంతో ఢిల్లీ, భోపాల్ వెళ్లే ప్రజలకు ఎంతో ఉపశమనం లభించనున్నది.
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా 2020 మార్చి 25 వ తేదీ నుంచి శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైళ్లతోపాటు అన్ని రైళ్లను నిలిపివేశారు. లాక్‌డౌన్ ముగిసిన తరువాత రైల్వే ట్రాఫిక్‌ను మెల్లమెల్లగా పునరుద్ధరిస్తున్నారు. తొలుత సుదూర ప్రాంతాలకు రైళ్లు నడిపారు. నవరాత్రి పండుగ సమీపించడంతో ఈ రైళ్లలో వేటింగ్ జాబితా చాంతాడంత తయారైంది.
పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే బోర్డు 196 రైళ్లను తిరిగి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. నార్త్ సెంట్రల్ రైల్వేకు చెందిన ఝాన్సీ డివిజన్ మూడు రైళ్లను నడపాలని ప్రతిపాదన పంపింది. ఝాన్సీ-పుణే ఎక్స్‌ప్రెస్, గ్వాలియర్-ఛప్రా (బరౌని మెయిల్) ఎక్స్‌ప్రెస్, ఝాన్సీ-బాంద్రాను నడిపించే ప్రతిపాదనను రైల్వే బోర్డుకు పంపారు. ఈ రైళ్లు ఈ నెలలో నడుస్తాయని భావిస్తున్నారు.
పండుగ కాలం ప్రారంభమైనందున ప్రయాణికుల సంఖ్య పెరుగడం మొదలైంది. శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైళ్లతోపాటు రాజధాని, దురంతో రైళ్లను కూడా నడుపాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. అలాగే ఈ నెల 16 నుంచి బాంద్రా నుంచి హజ్రత్ నిజాముద్దీన్‌కు యువ ఎక్స్‌ప్రెస్ ప్రత్యేక రైలును నడుపనున్నారు.
అన్‌లాక్ ప్రారంభమైన తర్వాత మే ఒకటో తేదీ నుంచి వలస కూలీల కోసం శ్రామిక్ ప్రత్యేక రైళ్లను, మే 12 నుంచి స్పెషల్ ఎయిర్‌కండీషన్డ్ రైళ్లను కేంద్ర రైల్వే శాఖ నడిపింది. జూన్ ఒకటో తేదీ నుంచి వంద రైళ్లను ప్రారంభించి.. సెప్టెంబర్ ఒకటి నుంచి మరో 80 రైళ్లను వాటితో కలిపి నడిపింది.
More Stories
ముడా స్కామ్‌లోరూ. 300 కోట్ల ఆస్తుల జప్తు
కర్ణాటకలో పట్టపగలే బ్యాంక్ లో రూ 12 కోట్లు దోపిడీ
సంచలన ఆరోపణలు చేసే హిండెన్‌బర్గ్ రీసెర్చ్ మూసివేత