అధ్యక్ష ఎన్నికల్లో ముందంజలో బిడెన్ 

మరో 20 రోజులలో జరుగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బిడెన్‌ విజయం స్పష్టంగా కనిపిస్తున్నదని అమెరికాలోని పలు వార్తాపత్రికల సర్వేలు చెప్తున్నాయి. అయితే ఇద్దరి మధ్య విజయావకాశాలు చాలా తక్కువ శాతంతో ఉండటంతో అమెరికన్లతోపాటు ఇతర దేశాల ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.

నాలుగేళ్ల క్రితం జరిగిన ఎన్నికలలో సహితం చివరి వరకు డోనాల్డ్ ట్రంప్ ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్ చివరివరకు సర్వేలలో ముందంజలో ఉండటం గమనార్హం. అమెరికా ఎన్నికల సమయంలోనే కరోనా వైరస్‌ మహమ్మారి డొనాల్డ్‌ ట్రంప్‌ విజయంపై చాలా ప్రభావం చూపుతున్నదని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.

కరోనా విషయంలో బాధ్యతారాహిత్యంగా ఉన్నారంటూ ట్రంప్ ప్రత్యర్ధులు దుమ్మెత్తి పోస్తున్నారు. సీఎన్ఎన్ పోల్ సర్వేలో ట్రంప్‌ కన్నా జో బిడెన్‌ 11 శాతం ఎక్కువ ప్రజల మద్దతు ఉన్నట్లుగా తేలింది. కరోనా విషయంలో ట్రంప్‌ బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించారని, ఇలాంటి అధ్యక్షుడు మళ్లీ రావడం వలన ప్రజలు మరింత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి  వస్తుందని అభిప్రాయపడుతున్నట్లు చాలా మంది చెప్పినట్లు తెలుస్తున్నది.

కరోనా విషయంలో ట్రంప్‌ది బాధ్యతారాహిత్యమని 63 శాతం మంది చెప్పగా.. తన చుట్టూ ఉండేవారి భద్రత, వైరస్‌ వ్యాప్తి ప్రమాదాన్ని విస్మరించారని పలువురు అభిప్రాయపడ్డారు. సియానా కాలేజీతో కలిసి న్యూయార్క్ టైమ్స్‌ నిర్వహించిన సర్వేలో కూడా జో బిడెన్‌కు మద్దతుగా ఓటర్లు నిలిచారు. రెండు ఎన్నికల్లోనూ నెవాడాలో బిడెన్ కంటే ట్రంప్‌ 6 పాయింట్లు వెనుకబడి ఉన్నారు.

నాలుగేండ్ల క్రితం ట్రంప్ ఒహియో నుంచి గెలిచినప్పటికీ, ప్రస్తుత పోల్‌లో అతను ఇంకా బిడెన్ కంటే 1 పాయింట్ వెనుకబడి ఉన్నాడు. అయితే, టెక్సాస్‌ ఒక్కటే ట్రంప్‌కు మద్దతుగా నిలుస్తుండటం విశేషం. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ప్రత్యర్థులతో పోలిస్తే దేశవ్యాప్తంగా ట్రంప్కు మద్దతు గణనీయంగా తగ్గుతున్నట్లు కనిపిస్తున్నది.

ట్రంప్ ప్రవర్తన కారణంగా మహిళలు, వృద్ధులు, పట్టణ ప్రజలు దూరమవుతున్నట్లుగా అంచనా వేస్తున్నారు. అమెరికాలో స్థిరపడిన విదేశీయులు ట్రంప్‌ వైఖరి కారణంగా ఆయనకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నది స్పష్టంగా కనిపిస్తున్నది. హెచ్‌1బీ1 వీసాల విషయంలో ట్రంప్‌ అమెరికన్లకు మద్దతుగా నిలబడటంతో అక్కడి భారతీయులు సహా ఇతర దేశాల వారు ట్రంప్‌పై కన్నెర్రజేస్తున్నారు.

కాగా, డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థిత్వం పొందేందుకు జో బిడెన్‌ అక్రమాలకు పాల్పడ్డారని, తన పార్టీని సోషలిస్ట్‌, మార్క్సిస్ట్‌, వామపక్ష తీవ్రవాదులకు తాకట్టుపెట్టారని ఫ్లోరిడాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ట్రంప్ ధ్వజమెత్తారు. ఈ ఎన్నికల్లో బిడెన్‌ గెలుపొందితే.. వామపక్ష తీవ్రవాదులే (రాడికల్‌ లెఫ్ట్‌) రాజ్యమేలుతారని హెచ్చరించారు. అధికారానికి వారు బానిసలయ్యారని అంటూ అమెరికా చరిత్రలోనే ఈ ఎన్నికలు అత్యంత కీలకమైనవని చెప్పారు. 

జో బిడెన్ ప్రచారం నిమిత్తం ఈ ఏడాదిలో ఇప్పటివరకు 500 మిలియన్ డాలర్లు (సుమారు రూ.3,665 కోట్లు) ఖర్చు చేశారు. గత నెల, బిడెన్ ప్రచారం టెలివిజన్, రేడియో కోసం 3 40.3 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.295 కోట్లు) ఖర్చు చేశారు.

అదే సమయంలో, యాడ్ ట్రాకింగ్ సంస్థ అడ్వర్టైజింగ్ అనలిటిక్స్‌ ప్రకారం.. డొనాల్డ్‌ ట్రంప్ ప్రచారం కోసం 23.3 మిలియన్ డాలర్లు (సుమారు రూ.170 కోట్లు) ఖర్చు చేశారు. గత వారం ఆయన తరపున ప్రచారం కోసం ఖర్చు చేసిన మొత్తానికి ఇది కొంచెం ఎక్కువ. గత వారం ఫేస్‌బుక్ ద్వారా ప్రచారం కోసం ట్రంప్‌ 5.2 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.38 కోట్లు), బిడెన్ 5.9 మిలియన్ డాలర్లు (సుమారు రూ.43 కోట్లు) ఖర్చు చేశారు.