`సంవాద్’ వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ప్రారంభం

పరిపూర్ణమైన వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం `సంవాద్’ను భారత్ లోనే హైదరాబాద్ కు చెందిన ధనుష్ ఇన్ఫో టెక్ రూపొందించింది. కోవిద్-19 అనంతర పరిస్థితులలో విద్యాసంస్థలు శిక్షణ కార్యక్రమాలను నిర్వహించుకోవడం కోసం తయారు చేసిన ఈ సదుపాయాన్ని ప్రముఖ సామాజిక కార్యకర్త, ఆర్ ఎస్ ఎస్ జాతీయ కార్యవర్గ సభ్యులు ఇంద్రేశ్ కుమార్ లాంఛనంగా ప్రారంభించారు.  
 
కోవిద్-19 అనేక నూతన సవాళ్ళను తీసుకు వస్తున్నదని అంటూ ఈ మహమ్మారి సహజసిద్ధంగా వచ్చినది కాదని, మానవ నిర్మితమే అని ఆయన స్పష్టం చేశారు. మార్చ్, 2020లో ఢిల్లీలో జరిగిన ఒక మత సమ్మేళనం ఈ మహమ్మారి వ్యాప్తిని దేశంలో వేగవంతం చేసిందని చెబుతూ దానితో మహమ్మారి బాధితుల సంఖ్య ఒకేసారి వేల నుండి లక్షలకు పెరిగిపోయినదని తెలిపారు
 
జీవాయుధమైన కోవిద్-19ని భారతీయ వైద్య విధానం, సాంఘిక దూరంలతో మాస్క్ లను  ధరించడంతో పాటు భారత నాయకత్వం తీసుకున్న సమర్ధవంతమైన చర్యల  ద్వారా విజయవంతంగా కట్టడి చేయగలిగామని చెప్పారు. భారత దేశం 85 శాతం రికవరీని సాధించిందని గుర్తు చేశారు. 
 
కోవిద్-19 సవాళ్ళను ఎదుర్కోవడంలో భారతీయులు అనేక వినూత్నమైన పరిష్కారాలను ఆవిష్కరించారని అంటూ `సంవాద్’ వాటిల్లో ఒకటని కొనియాడారు.  కోవిద్-19 సమయంలోనే కాకుండా ఆ తర్వాత కూడా శిక్షణా కార్యక్రమాలు సమర్ధవంతంగా నిర్వహించడానికి ఇది ఉపయోగ పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 
 
భారతీయులు త్వరితగతిన వర్చ్యువల్ సమాచార వ్యవస్థను అనుసరిస్తున్నారని అంటూ గత ఐదు నెలల్లో తానే 55కు పైగా వెబినార్ లలో 15 లక్షలమందిని పైగా ఉద్దేశించి ప్రసంగించినట్లు ఇంద్రేశ్ కుమార్ తెలిపారు. సవాళ్లు ఎదురైనప్పుడే పరిష్కారాలు కూడా లభిస్తాయని అంటూ అందుకు `సంవాద్’ను ఉదాహరణగా చూపారు. 
 
ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన `ఆత్మా నిర్భర్ భారత్’ పిలుపందుకొని ధనుష్ ఇన్ఫో టెక్ అత్యుత్తమమైన సాధనంగా `సంవాద్’ ను రూపొందించినట్లు ఆయన కొనియాడారు. 
 
కోవిద్-19 విసిరిన సవాళ్ళను ఎదుర్కొని, విద్యాబోధనకు పెరుగుతున్న డిమాండ్ లను అందుకోవడానికి సంధించిన “బ్రహ్మాస్త్రం” సంవాద్ అని ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ గీతాసింగ్ ప్రశంసించారు.  భారతీయ ఆలోచనలతో, భారత దేశంలోనే, ఒక భారతీయ కంపెనీ దీనిని రూపొందించడం పట్ల హర్షం ప్రకటించారు. 
 
ఢిల్లీకి 200 కిమీ దూరంలోని ఒక మారుమూల గ్రామం నుండి ఈ సమావేశంకు హాజరైనా చాలా స్పష్టంగా ఈ వెబినార్ సమావేశం జరగడాన్ని ప్రస్తావిస్తూ సాంకేతికంగా సంవాద్ విశిష్టతను వెల్లడి చేస్తున్నదని ఎఐసిటిఇ డైరెక్టర్ డా. ఆనంద్ శర్మ తెలిపారు. ఇటువంటి సాధనాలు భారత దేశంలోని విద్య, పరీక్షల స్వరూపంలో విశేషమైన మార్పులు తీసుకు రావచ్చని విశ్వాసం వ్యక్తం చేశారు.
 
అంతర్జాతీయంగా ప్రస్తుతం అందుబాటులో ఉన్న పలు వాటికన్నా “సంవాద్” సాంకేతికంగా సుస్థరత కలిగి, విశేషమైన అంశాలతో తేలికంగా, గరిష్టంగా ఉపయోగించుకొనే సౌలభ్యంతో తయారు చేశామని ధనుష్ ఇన్ఫో టెక్ చైర్మన్ డి ఎస్ ఎన్ మూర్తి తెలిపారు. ధనుష్ సీనియర్ ఉపాధ్యక్షులు వి ఎస్ రామచంద్ర, రవి చావాలి కూడా పాల్గొన్నారు.