చైనా మద్దతుతో జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 పునరుద్ధరించబడుతుందని తాను భావిస్తున్నానన్న ఫరూక్ అబ్దుల్లా ప్రకటనపై భారతీయ జనతా పార్టీ మండిపడింది. ఆయన వ్యాఖ్యలు ముమ్మాటికీ దేశద్రోహం కిందకే వస్తాయని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫరూక్ అబ్దుల్లా చైనా యొక్క విస్తరణవాద ఆలోచనను సమర్థించేందుకు ప్రయత్నించారని ధ్వజమెత్తారు.
ఆదివారం తనను కలిసిన మీడియాతో ఫరూక్ అబ్దుల్లా మాట్లాడుతూ.. చైనా మద్దతుతో జమ్ముకశ్మీర్‌లో 370 ఆర్టికల్‌ను పునరుద్ధరించబడుతుందని తాను భావిస్తున్నట్లు చెప్పారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ ఫరూక్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. అలా మాట్లాడటం ముమ్మాటికీ దేశద్రోహమే అని పేర్కొన్నది.
పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న ఫరూక్ అబ్దుల్లా చైనా మద్దతు తీసుకుంటామని మీడియాతో చెప్పడం పూర్తిగా అభ్యంతరకరం అని స్పష్టం చేసింది. ఆర్టికల్ 370 ని రద్దుచేయడం చైనాను కలవరపరిచిందని, చైనా విస్తరణవాద ఆలోచనను సమర్థించేందుకు ప్రయత్నించారని సంబత్ పాత్ర ఆరోపించారు. ఆయన ప్రకటన తన మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తుందని ఆయన దుయ్యబట్టారు.
“దేశ సార్వభౌమత్వాన్ని ప్రశ్నించడం, దేశ స్వాతంత్రయాన్ని ప్రశ్నించడం, ఒక ఎంపీకి సరిపోతుందా? ఇవి దేశ వ్యతిరేక విషయాలు కావా?” అని ప్రశ్నించారు. అదే ఫారూక్ అబ్దుల్లా.. పాకిస్తాన్ గాజులు ధరించి ఉన్నట్లయితే భారత్ పీఓకేను తీసుకుంటుందని కూడా అన్నారని గుర్తు చేశారు.
“పాకిస్తాన్‌పై భారత్ చేసిన సర్జికల్ స్ట్రైక్స్, వైమానిక దాడులను ప్రశ్నించిన రాహుల్ గాంధీకి ఇప్పుడు ఫరూక్ అబ్దుల్లా చైనా విషయంలో హీరో అయ్యారు” అని సంబిత్ పాత్ర ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ, ఫరూక్ అబ్దుల్లా ఇద్దరూ ఒకే నాణానికి రెండు వైపులా ఉన్నారని మండిపడ్డారు.
ఇదే రాహుల్ గాంధీ, కొద్ది రోజుల క్రితం ప్రధాని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని, భారతదేశం లొంగిపోయిందని చెప్పారన్నారని గుర్తు చేశారు. దేశ సార్వభౌమాధికారం, ఐక్యత, సమగ్రతపై రాజీపడటం లేదా ప్రకటనలు చేయడం చాలా విచారకరమని, దేశానికి వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పారు.
More Stories
దుర్గామాతపై గర్భా గీతం రాసిన ప్రధాని మోదీ
ఇజ్రాయెల్- హమాస్ మధ్య పోరుకు ఏడాది పూర్తి
గోమాత విజ్ఞాన పరీక్షా పోస్టర్ ఆవిష్కరించిన భగవత్