ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థి కవిత కల‍్వకుంట్ల ఘన విజయం సాధించారు. మొదటి ప్రాధాన్యత ఓటుతోనే ఫలితం వెల్లడి అయింది.14వ ఎమ్మెల్సీగా కవిత ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక కాంగ్రెస్, బీజేపీ డిపాజిట్లు కోల్పోయాయి.
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి అక్టోబర్ 9న పోలింగ్ జరిగింది. మొత్తం 824 మంది ఓటర్లు ఉండగా, 823 మంది ప్రజాప్రతినిథులు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఒక ఓటరు మరణించగా, కరోనా కారణంగా ఇద్దరు ప్రజాప్రతినిథులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటును వినియోగించుకున్నారు.
అధికార పార్టీ ఆది నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దూకుడు ప్రదర్శించింది. ప్రత్యర్థులను చిత్తు చేసే ఎత్తుగడలు వేస్తూ ‘కారు’వేగంతో దూసుకెళ్లింది. భారీ మెజారిటీ లక్ష్యంగా టీఆర్‌ఎస్ పకడ్బందీగా అమలు చేసిన వ్యూహానికి ప్రత్యర్థి పార్టీలు డీలా పడ్డాయి. టీఆర్‌ఎస్‌కు 728.. బీజేపీకి 56.. కాంగ్రెస్‌కు 29 ఓట్లు వచ్చాయి.
స్థానిక సంస్థల్లో టీఆర్‌ఎస్‌కు పూర్తి స్థాయిలో బలం ఉన్నప్పటికీ బిజేపీ, కాంగ్రెస్‌లకు చెందిన ప్రజాప్రతినిధులని భారీ ఎత్తున ఫిరాయింపులకు ప్రోత్సహించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించేందుకు టీఆర్‌ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది.
ఆయా నియోజక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఓటర్లను ఈ నెల 3న శిబిరాలకు తరలించారు. ఓటింగ్ రోజు ఉదయం నేరుగా పోలింగ్ కేంద్రాలకు తీసుకొచ్చి ఓట్లు వేయించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తెగా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా తెలంగాణ ఉద్యమం చివరి దశలో కవిత ప్రజాజీవనంలో ప్రవేశించి 2014లో నిజామాబాదు నుండి లోక్ సభకు ఎన్నికై అధికార పక్షంలో కీలక అధికార కేంద్రంగా ఎదిగారు.
అయితే గత ఏడాది ఎన్నికలలో బిజెపి అభ్యర్థి డి అరవింద్ చేతిలో పరాజయం చెందడంతో ఆమె క్రియాశీల రాజకీయాలకు అప్పటి నుండి దూరంగా ఉంటూ వస్తున్నారు. తిరిగి ఇప్పుడు ఎమ్యెల్సీగా ఎన్నిక కావడం ద్వారా ఆమె అన్న కేటీఆర్ కు తోడుగా టీఆర్‌ఎస్ లో, రాష్ట్ర ప్రభుత్వంలో సహితం నిర్ణయాత్మక శక్తిగా ఎదిగే సూచనలు కనిపిస్తున్నాయి.
More Stories
మోదీ పుట్టిన రోజుకు బిజెపి కార్యకర్తలకు `ప్రజాస్వామ్య తోఫా’
నల్గొండ బిఆర్ఎస్ కార్యాలయం కూల్చివేయాలని హైకోర్టు ఆదేశం
జానీ మాస్టర్ పై పోక్సో కేసు