15న పీఎం ‌మోదీ బయోపిక్ రీరిలీజ్

లాక్‌డౌన్ వ‌ల‌న దాదాపు ఏడు నెల‌లుగా మూత‌బ‌డ్డ థియేట‌ర్స్ ఈ నెల 15 నుండి తెర‌చుకోనున్నాయి. కేంద్ర ప్ర‌భుత్వం నిబంధ‌న‌ల ప్ర‌కారం 50 శాతం ఆక్యుపెన్సీతో థియేట‌ర్స్ న‌డ‌ప‌నున్నారు. అదే రోజున భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌ని అక్టోబ‌ర్ 15న‌ రీరిలీజ్ చేయ‌బోతున్నట్టు నిర్మాతలు అధికారికంగా  ప్ర‌క‌టించారు.  
 
భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ జీవిత నేప‌థ్యంలో  ‘పీఎం నరేంద్రమోదీ’ బయోపిక్ రూపొంద‌గా, ఈ చిత్రాన్ని 2019 ఎన్నికల  ముందు రిలీజ్ చేయాల‌ని నిర్మాతలు భావించారు. కాని ఎన్నిక‌ల కోడ్ అమ‌లులో ఉండ‌డంతో ఫలితాల త‌ర్వాత గత ఏడాది మే 24న చిత్రాన్ని విడుదల చేశారు. 
 
చాయ్ వాలా నుంచి భారత ప్రధానిగా మోదీ జీవిత పయనం ఎలా సాగిందో ఈ సినిమా లో చూపించారు. ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహించిన‌ ఈ చిత్రాన్ని సందీప్ సింగ్ నిర్మించారు. వివేక్ ఒబేరాయ్ ప్ర‌ధాన పాత్ర పోషించారు.
 
పీఎం నరేంద్రమోదీ బయోపిక్ విడుదల స‌మ‌యంలో అనేక వివాదాలు తలెత్త‌డంతో సినిమాకు వసూళ్లు  అంత‌గా రాలేదు. ఈ నేప‌థ్యంలో థియేట‌ర్స్ ఓపెన్ అయిన త‌ర్వాత చిత్రాన్ని తిరిగి విడుదల చేయాల‌ని నిర్మాత సందీప్ సింగ్ భావించారు‌. 
 
రీరిలీజ్ చేయాల‌నే ఉద్దేశంతోనే చిత్రాన్ని ఓటీటీ లేదా టీవీలో కూడా ప్ర‌సారం చేయ‌లేదు. ఈ సినిమాని వెండితెర‌పై మ‌రోసారి చూడాల‌ని ప్ర‌జ‌లు ఆశిస్తున్నారు