లేహ్‌లోని భారత వాయు సేన (ఐఏఎఫ్) పైలట్లలో ఉరిమే ఉత్సాహం కనిపిస్తోంది. భారత దేశం సత్తా చాటేందుకు పోరాట స్ఫూర్తి కనిపిస్తోంది. మే నెల నుంచి వాస్తవాధీన రేఖ వెంబడి చైనా అనుసరిస్తున్న ఘర్షణాత్మక వైఖరిని తుద ముట్టించాలన్న కసి కనిపిస్తోంది.
లేహ్ వైమానిక స్థావరంలోని ఐఏఎఫ్ పైలట్లు మాట్లాడుతూ, ఎలాంటి ముప్పునైనా తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. భారత వాయు సేన పశ్చిమ, ఉత్తర దిక్కుల (పాకిస్థాన్, చైనా) నుంచి ఎదురయ్యే ముప్పును గట్టిగా తిప్పికొట్టగలదని చెప్పారు. సిబ్బంది అనితర సాధ్యమైన శిక్షణ పొందినట్లు తెలిపారు.
శత్రువులపై విరుచుకుపడటానికి అనువైన పరిస్థితిలో మనం ఉన్నామని చెప్పారు. వ్యూహాత్మక ప్రాంతాల్లో మోహరింపులు పూర్తయినట్లు తెలిపారు. శీతాకాలం సవాళ్లను దీటుగా ఎదుర్కొంటామన్నారు. శత్రువులను సరైన రీతిలో అంచనా వేసినట్లు, వారిని ఎదుర్కొనేందుకు తగిన ప్రణాళికలను సిద్ధం చేసినట్లు చెప్పారు.
వాతావరణంలో మార్పుల వల్ల సవాళ్ళు పెరుగుతాయని చెప్పారు. తమకు ఆత్మస్థయిర్యం ఎక్కువ అని, అత్యాధునిక పరికరాలు అందుబాటులో ఉండటం వల్ల శత్రువులను ఎదుర్కొనగలమని పేర్కొన్నారు.
ఇదిలావుండగా, హిందోన్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో ఈ నెల 8న జరిగిన ఐఏఎఫ్ 89వ ఆవిర్భావ దినోత్సవంలో ఐఏఎఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ రాకేశ్ కుమార్ సింగ్ బడౌరియా మాట్లాడుతూ, అత్యంత వేగంగా స్పందించినందుకు యోధులను ప్రశంసించారు.
ఉత్తర సరిహద్దుల్లో ఇటీవలి ప్రతిష్టంభన సమయంలో యుద్ధ విమానాలను అత్యంత తక్కువ సమయంలో మోహరించామని పేర్కొన్నారు. భారత సైన్యం మోహరింపు కోసం అవసరమైన సహకారం అన్ని విధాలుగా అందించామన్నారు. ‘‘మన దృఢ నిశ్చయాన్ని మనం స్పష్టంగా ప్రదర్శించాం’’ అని చెప్పారు.
More Stories
హిందూ వివాహం అంటే ఒక కాంట్రాక్ట్ కాదు
ఆధార్ ఉచిత అప్డేట్ గడువు మరోసారి పొడిగింపు
కఠువా ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం