మాజీ ఎంపీ, టిడిపి నేత జేసీ దివాకరరెడ్డి పై ఒక వంక ఆయన కుటుంభం సంస్థల్లో అక్రమాలను మైనింగ్ అధికారులు గుర్తించి మైనింగ్ శాఖ నోటీసులు జారీ చేయగా, మరోవంక అధికారులపై దుర్భాషలాడారని పోలీసులు కేసు నమోదు చేశారు.
సుమన, భ్రమరాంబ సంస్థల పేరుతో జేసీ మైనింగ్ క్యారీ నిర్వహిస్తున్నారు. ముచ్చుకోటలో రెండు డోలమైట్ మైనింగ్ క్వారీలను ఆయన నిర్వహిస్తున్నారు. జేసీ మైనింగ్ సంస్థల్లో కార్మికుల భద్రతను గాలికొదిలేశారని ఆరోపణలు వస్తున్నాయి. మినరల్ మేనేజర్ పర్యవేక్షణలో మైనింగ్ పనులు జరలేదనే విమర్శలు వస్తున్నాయి.
దివాకర్‌రెడ్డి రెండు క్వారీల్లో నిబంధనల ఉల్లంఘించారని మైనింగ్ డిప్యూటీ డైరెక్టర్ రమణారావు చెబుతున్నారు. ఉన్నతాధికారులకు నివేదిక పంపి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. తమ మైనింగ్ సంస్థలపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో శుక్రవారం తాడిపత్రిలో గనులశాఖ కార్యాలయానికి జేసీ దివాకర్‌రెడ్డి వెళ్లారు.
అయితే జేసీ వెళ్లిన సమయంలో మైన్స్ ఏడీ లేరు. దీంతో దివాకర్‌రెడ్డి వెనుతిరిగారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ‘‘నేను వస్తున్నానని తెలుసుకొని మైన్స్ ఏడీ పరారయ్యారు. మా జీవనాధారం గనులే…నా కడుపు కొట్టకండి. 8 జీపుల్లో వచ్చి మా గనులను తనిఖీ చేయడంలో ఆంతర్యం ఏంటి? మా గనుల్లో నక్సలైట్లు ఏమైనా ఉన్నారా?” అంటూ ప్రశ్నించారు.
“ఇంతకు ముందు మా తమ్ముడిని టార్గెట్ చేశారు. ఇప్పుడు నన్ను చేస్తున్నారు. మా ప్రభుత్వం వస్తే మేం కాదు..మా కార్యకర్తలు అధికారులను వదలరు. పోలీసులు బదిలీలకు భయపడి అధికార పార్టీకి ఊడిగం చేయొద్దు. పోలీసులు ఇంత బానిస బతుకు ఎందుకు బతుకుతున్నారు. కాలం మారుతుంది జాగ్రత్త’’ అని జేసీ దివాకర్ రెడ్డి హెచ్చరించారు.
దానితో తాడిపత్రి టౌన్ పీఎస్‌లో 153/A , 506 సెక్షన్ల కింద ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాడిపత్రి గనులశాఖ కార్యాలయంలో అధికారులను కించపరిచేలా జేసీ వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదు చేశారు.
ఇలా ఉండగా, గతంలో యాడికిలోని దివాకర్‌రెడ్డికి సంబంధించిన త్రిశూల్ సిమెంట్ కంపెనీ లీజును ప్రభుత్వం రద్దు చేసింది. కొనుప్పలపాడులో 649.86 హెక్టార్ల పరిధిలోని.. సున్నపు రాతి గనుల లీజుల్ని రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సిమెంట్ తయారీ ప్లాంట్ నిర్మాణానికి మరో ఐదేళ్ల గడువు పొడిగిస్తూ గతంలో జారీ చేసిన ఉత్తర్వుల్ని ప్రభుత్వం వెనక్కు తీసుకుంది.
ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేదని లీజు రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. 38,212 మెట్రిక్ టన్నుల సున్నపురాయి నిక్షేపాన్ని అక్రమంగా తవ్వి తీయడం, రవాణా చేయడంపై విచారణ చేపడుతామని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
More Stories
వేదాలు భౌతిక, ఆధ్యాత్మిక జ్ఞానపు నిధి
బెంగాల్ పోలీసుల నిర్లక్ష్యంతో కీలక ఆధారాలు నాశనం
మోదీ పుట్టిన రోజుకు బిజెపి కార్యకర్తలకు `ప్రజాస్వామ్య తోఫా’