బెంగాల్ లో  రసాయనాల వాట‌ర్ క్యాన‌న్‌ ప్ర‌యోగం 

ప‌శ్చిమ‌బెంగాల్ రాజ‌ధాని కోల్‌క‌తాలో ‘చ‌లో న‌బ‌న్నా’ పేరిట బీజేపీ చేప‌ట్టిన నిర‌స‌న‌ ర్యాలీలో పాల్గొన్నవారిపై రసాయనాలతో కూడిన వాటర్‌ క్యానన్‌ ప్రయోగించినట్లు తన దృష్టికి వచ్చిందని కేంద్ర మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ ఆరోపించారు. అందుకే కొందరు వాంతులు చేసుకున్నారని, సుమారు 1500 మంది కార్యకర్తలు గాయపడ్డారని చెప్పారు. 

పోలీసులు, లాఠీలను ప్రయోగించినంత మాత్రానా ఆ రాష్ట్రంలో బీజేపీ విస్తరణను నిలువరించడంలో సీఎం మమతా బెనర్జీ, టీఎంసీ విజయవంతం కాలేవని రవి శంకర్‌ ప్రసాద్‌ హెచ్చరించారు. 

బీజేపీ నేత హత్యకు నిరసనగా శాంతియుతంగా నిరసన ర్యాలీ నిర్వహిస్తున్న బీజేపీ కార్యకర్తలపై నాటు బాంబులు, వాటర్‌ క్యానన్‌లు ప్రయోగించడాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తప్పుపట్టారు. మమతా అధికారానికి రోజులు దగ్గర పడటంతో ఆ నిరాశతోనే ఆమె ఇలా చేస్తున్నారని ఆయన విమర్శించారు. 

మరోవైపు రసాయనాతో కూడిన వాట‌ర్ క్యాన‌న్‌లు ప్ర‌యోగించారన్న కేంద్ర మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ వ్యాఖ్యలను ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అలపన్ బందోపాధ్యాయ ఖండించారు. ఎలాంటి రసాయనాలు వాడలేదని, ఇది తప్పుడు సమాచారమని తెలిపారు. 

నిరసనకారులను గుర్తించి అనంతరం వారిపై చర్యలు తీసుకునేందుకు వాటర్‌ క్యానన్‌ నీటిలో రంగు కలపడం ప్రపంచవ్యాప్తంగా అనుసరిస్తున్న విధానమేనని చెప్పారు. కరోనా వేళ లాక్‌డౌన్‌ అమలవుతున్న తరుణంలో సుమారు 25 వేల మందితో కూడిన ర్యాలీలను అనుమతించాలని కోరడం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.