యూపీలో విపక్షాలవి శవ రాజకీయాలు

హత్రాస్ గ్యాంగ్ రేప్ ఘటనపై విపక్షాలు చేస్తున్న నిరసనల మీద ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మండిపడ్డారు. రాష్ట్రానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు కుట్ర పన్నుతున్నాయని యోగి ఆరోపించారు. కుల, మత, ప్రాంతాల ప్రాతిపదికన రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. 
 
‘ఇప్పటికీ కొందరు సమాజాన్ని కుల, మత, ప్రాంతాల ప్రాతిపదికన విభజించాలని యత్నిస్తున్నారు. వారికి అభివృద్ధి కనిపించడం లేదు. అందుకే వాళ్లు కొత్త కుట్రలను పన్నుతున్నారు. ఓ వ్యక్తి మృతిపై రాజకీయాలు చేస్తున్న వారిని అందరూ గుర్తించాలి’ అని యోగి  పిలుపిచ్చారు. 
 
కాగా, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆడ‌పిల్ల‌ల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోయింద‌ని కాంగ్రెస్ నేత‌లు చేస్తున్న ఆరోపణలను కేంద్ర‌మంత్రి రాందాస్ అథ‌వాలే తిప్పికొట్టారు. రాహుల్‌గాంధీ బీజేపీని కించ‌ప‌ర‌చ‌డ‌మే ల‌క్ష్యంగా వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు.

కాంగ్రెస్ పాలిత రాష్ట్ర‌మైన రాజ‌స్థాన్‌లోనూ హ‌థ్రాస్ త‌ర‌హా అత్యాచార ఘ‌ట‌న‌లు జ‌రుగుతున్నాయ‌ని, కానీ రాహుల్‌గాంధీ అక్క‌డి బాధితుల‌ను ప‌రామ‌ర్శించ‌ర‌ని అథ‌వాలే ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో జ‌రిగే నేరాలు రాహుల్‌గాంధీకి క‌నిపించ‌వా అని ఆయ‌న నిలదీశారు. 

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నేరాలు జ‌రిగితే మాత్రం రాహుల్‌గాంధీ అక్క‌డ ప‌నిగ‌ట్టుకుని వాలిపోతార‌ని, అక్క‌డి పాల‌కుల‌ను అవ‌మానిస్తూ విమ‌ర్శ‌లు చేస్తార‌ని అథ‌వాలే ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు.