అన్నాడీఎంకే  సీఎం అభ్యర్థి ప‌ళ‌నిస్వామియే

అన్నాడీఎంకే  సీఎం అభ్యర్థి ప‌ళ‌నిస్వామియే

త‌మిళ‌నాడులో వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఎన్నిక‌ల కోసం తమ ముఖ్యమంత్రి  అభ్య‌ర్థిని అధికారంలో ఉన్న  అన్నాడీఎంకే పార్టీ ఖ‌రారు చేసింది.  ప్ర‌స్తుత సీఎం ప‌ళ‌నిస్వామియే వ‌చ్చే  ఎన్నిక‌ల‌కు కూడా సీఎం అభ్య‌ర్థిగా పోటీ చేస్తార‌ని ఆ పదవికోసం తీవ్రంగా పోటీ పడిన ఉప ముఖ్యమంత్రి ప‌న్నీరుసెల్వం బేడీ  స్వయంగా  ప్ర‌క‌టించారు.

2021లో జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో 11 మంది స‌భ్యుల‌తో కూడిన స్టీరింగ్ క‌మిటీని ఏర్పాటు చేసిన‌ట్లు అన్నాడీఎంకే పార్టీ నేత‌, సీఎం ప‌ళ‌నిస్వామి తెలిపారు.  ప‌న్నీరుసెల్వం కూడా సీఎం అభ్య‌ర్థిగా పోటీప‌డేందుకు పట్టుబట్టడంతో అన్నాడీఎంకే పార్టీలో గ‌త కొన్నాళ్లుగా ఈ అంశంలో అల‌జ‌డి రేగింది.

కానీ సుదీర్ఘ మంత‌నాల త‌ర్వాత అన్నాడీఎంకే తుది నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించింది. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప‌ళ‌నిస్వామియే సీఎం అభ్య‌ర్థిగా పోటీ చేస్తార‌ని ప‌న్నీరుసెల్వం ప్ర‌క‌టించారు. విపక్ష డీఎంకేలో స్టాలిన్ లాంటి బలమైన నేత ఉన్న నేపథ్యంలో అధికార అన్నాడీఎంకే నుంచి ఎవరు సీఎం అభ్యర్థిగా ఉంటారనే దానిపై ఉత్కంఠ రేగింది.

తమిళనాడు మాజీ సీఎం, దివంగత జయలలిత మరణం తర్వాత కొన్నాళ్లు పన్నీర్ సెల్వం సీఎంగా ఉన్నారు. ఆ తర్వాత శశికళ సాయంతో పళని సీఎం సీటు దక్కించుకున్నారు. అప్పటినుంచి పళని సీఎంగా కొనసాగుతుండగా, పార్టీ వ్యవహారాలతో పాటు డిప్యూటీ సీఎం బాధ్యతలను పన్నీర్ సెల్వం నిర్వర్తిస్తున్నారు. 

మూడున్నరేళ్లు పళని స్వామి సీఎంగా ఉన్నందున ఈసారి ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలబడేందుకు తనకు అవకాశం ఇవ్వాలని పన్నీర్ సెల్వం పట్టుబట్టారు. దీంతో పార్టీలో పలు చర్చలు జరిగాయి.