అన్నాడీఎంకే పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే ప్రేమ పెళ్లి తమిళనాడులో పెను దుమారం రేపింది. దళిత సామాజిక వర్గానికి చెందిన అన్నాడీఎంకే ఎమ్మెల్యే ప్రభు (35), డిగ్రీ సెకండియర్ చదువుతున్న సౌందర్య(19) ప్రేమ వివాహం చేసుకున్నారు.
యువతి తండ్రి ఎస్ స్వామినాథన్ మలైకోట్టైలోని అమ్మవారి ఆలయంలో అర్చకుడు. ప్రభు, సౌందర్య పెళ్లి సమయంలో కొన్ని నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నట్లు తెలిసింది. అక్టోబర్ 5న ప్రభు ఇంట్లో పెళ్లి సందడి, కోలాహాలం నెలకొన్న సమయంలో అక్కడికి సౌందర్య తండ్రి స్వామినాథన్ వెళ్లారు.
ఈ పెళ్లి జరిగితే తనను తాను తగలబెట్టుకుని ఆత్మహత్య చేసుకుంటానని ఒంటిపై పెట్రోల్ పోసుకుని ప్రభును, అతని కుటుంబీకులను బెదిరించారు. తన కూతురిని ప్రభు బలవంతంగా ఎత్తుకొచ్చి మరీ పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడని అక్కడున్న వారితో చెప్పారు.
తనకు కులం పట్టింపు లేదని, కానీ ఇద్దరి మధ్య ఉన్న వయసు వ్యత్యాసం వల్లే తాను ఈ పెళ్లికి అభ్యంతరం తెలుపుతున్నట్లు స్వామినాథన్ తెలిపారు. ఈ ఆరోపణలు తమిళనాట దావానలంలా వ్యాపించాయి.
అధికార అన్నాడీఎంకే ఎమ్మెల్యే ప్రభు ఓ అమ్మాయిని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్నాడని నెట్‌లో విస్తృతంగా ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని ఖండించిన ప్రభు తన పెళ్లిపై రేగిన దుమారంపై వీడియో ఒకటి విడుదల చేసి వివరణ ఇచ్చారు.
తామిద్దరం నాలుగు నెలలుగా ప్రేమించుకుంటున్నామని, పెళ్లి చేసుకోవాలని భావించి ఆ అమ్మాయి కుటుంబాన్ని సంప్రదించగా వారు పెళ్లికి అభ్యంతరం తెలిపారని ప్రభు చెప్పారు.
దీంతో తన తల్లిదండ్రుల అంగీకారంతో తామిద్దరం ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నామని ఎమ్మెల్యే ప్రభు తెలిపారు. ఇదిలా ఉంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు పాల్పడ్డ సౌందర్య తండ్రిని పోలీస్ స్టేషన్‌కు తరలించి, ఆయనపై ఐపీసీ సెక్షన్ 309 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
More Stories
కేరళలో నిపా కలకలం.. మరోసారి మాస్క్ తప్పనిసరి!
విష జ్వరాలతో అల్లాడుతున్న కర్ణాటక ప్రజలు
జమిలి ఎన్నికలకు పట్టుదలతో మోదీ ప్రభుత్వం