రాజకీయాల కోసమే వ్యవసాయ చట్టంకు వ్యతిరేకం 

కేసీఆర్ కేవలం స్వార్థ రాజకీయాల కోసమే కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్నరని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. మన ముఖ్యమంత్రికి కుటుంబ ఆస్తులు పెంచుకోవడంపై ఉన్న యావ రైతు సంక్షేమంపై లేదని దుయ్యబట్టారు.

కళ్లుండి చూడలేని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టంతా 
అక్రమ టెండర్లతో డబ్బులు సంపాదించుకోవడం, ప్రజలను మోసం చేయడం పైననే అని విమర్శించారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ రైతు ద్రోహిగా చరిత్రలో నిలవనున్నాడని హెచ్చరించారు.
రాబోయే రోజుల్లో వ్యవసాయరంగ సంస్కరణలపై రైతులకు కలిగే ప్రయోజనాలను తెలియజేసేందుకు పోలింగ్ బూత్ స్థాయిలో ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని వెల్లడించారు.
 
ప్రతి గ్రామంలో పోలింగ్ బూత్ స్థాయిలో రైతులతో మమేకమై కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ సంస్కరణలపై కరపత్రాల రూపంలో ప్రచారం చేపడుతామని చెప్పారు. నూతన వ్యవసాయ విధానానికి నాంది పలికిన ప్రధాని  నరేంద్ర మోదీ గారికి లేఖల ద్వారా కృతజ్నతలు తెలిపే కార్యక్రమం చేపడుతామని తె. లిపారు
 
జిల్లాలు, మండలాల వారీగా రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసి నూతన వ్యవసాయ చట్టాలపై అవగాహన కల్పిస్తామని చెబుతూ రైతు చట్టాలపై క్షేత్రస్థాయిలో ప్రజలకు వాస్తవాలు వివరిస్తామని వివరించారు. 
 
వ్యవసాయ చట్టాలతో రైతు చేతికి అధికారం, స్వేచ్చా హక్కులు అందడమే కాకుండా సరకు డెలివరీ అయిన మూడు రోజుల్లోనే కొనుగోలుదారుడు రైతుకు డబ్బు చెల్లించే నిబంధనను తీసుకొచ్చిందిని, లేకుంటే జరిమానా చెల్లించాలని సంజయ్ కొనియాడారు. పంట అమ్మకం విషయంలో రైతు, కొనుగోలుదారు మధ్య ఏదైనా సమస్య తలెత్తితే ఆ ప్రాంతంలోని సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ 30 రోజుల్లోగా ఆ సమస్యను పరిష్కరించేలా చట్టం రూపొందిందని చెప్పారు.
 
ఇన్నాళ్లు పంట అమ్మకం విషయంలో రైతే కొనుగోలుదారు దగ్గరకు వెళ్లాల్సి వచ్చేదని అంటూ ఆయా కంపెనీలు, వ్యాపారస్తులు గ్రామాలకు వచ్చి కొనుగోలు చేసుకునే వెసులుబాటు కల్పించడంతో గ్రామాల్లో ఉపాధి అవకాశాలు పెరిగి గ్రామీణ యువతకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని సంజయ్ వివరించారు. .