కాలక్రమేణా బలహీనపడుతున్న కరోనా వైరస్     

వాక్సిన్ వచ్చే వరకు వచ్చేదాకా కరోనా మహమ్మారిని ఎదుర్కోవడం కష్టమే అని నిపుణులు కూడా ఆందోళన చెందుతున్న సమయంలో  కరోనా వైరస్‌ కాలక్రమేణా బలహీనపడుతోందని ఓ తాజా అధ్యయనంలో వెల్లడైనది. అంటే వైరస్‌లోడ్‌ తగ్గిపోయిందన్నమాట.
దీంతో ఇన్ఫెక్షన్లు తగ్గిపోయాయని, కొవిడ్‌తో దవాఖానలో చేరుతున్నవారి సంఖ్య కూడా గణనీయంగా తగ్గుతున్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వేన్ స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు.
ఏప్రిల్, జూన్ మధ్య డెట్రాయిట్ మెడికల్ సెంటర్లో దవాఖానలో చేరిన 700 మంది రోగుల నుంచి నమూనాలు‌ తీసుకొని, పరిశీలించారు. మొదటి వారంలో, సగం నమూనాలలో అధిక వైరల్ లోడ్లు ఉన్నట్లు కనుగొన్నారు. వాటిలో నాలుగోవంతు మాత్రమే తక్కువ వైరల్‌ లోడ్‌ కలిగి ఉన్నాయి. వారిలో 14శాతం మంది కన్నుమూశారు.
అయితే, అయిదో వారం నాటికి, 70 శాతానికి పైగా నమూనాలలో తక్కువ వైరల్ లోడ్ ఉన్నట్లు తేలింది. మహమ్మారి కాలక్రమేణా బలహీనపడుతోందని తాము గుర్తించామని, దీంతో తక్కువమంది మాత్రమే దవాఖానలో చేరుతున్నారని అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్ ప్రణార్థతి చంద్రశేఖర్‌ వెల్లడించారు. మాస్కులు ధరిస్తూ భౌతికదూరాన్ని పాటిస్తే టీకా వచ్చేంతవరకు ఎలాంటి ప్రమాదం ఉండదని తాము భావిస్తున్నట్లు చెప్పారు. 

ఇలా ఉండగా, మరో మూడు నెలల్లో బ్రిటన్ ప్రజలందరికీ కరోనా టీకా అందుబాటులోకి రానున్నట్టు టైమ్స్ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. కొత్త ఏడాది ప్రారంభమయ్యేలోపే కావలిసిన అనుమతులను ప్రభుత్వం జారీ చేయాలని టీకా రూపకల్పనలో పాలుపంచుకుంటున్న శాస్త్రవేత్తలు ఆశిస్తున్నట్టు తెలిపింది. 

అయితే చిన్నారులు మినహా మిగతా ప్రజలందరికీ టీకా ఇవ్వదలిస్తే ఈ ప్రక్రియ మొత్తం మరింత వేగవంతమయ్యే అవకాశం ఉన్నట్టు అక్కడి నిపుణులు చెబుతున్నట్లు తెలిపింది.

 ఐరోపాకు చెందిన యూరోపియన్ మెడికల్ ఏజెన్సీ  ఆక్స్‌ఫర్డ్ టీకా పురోగతిని ఎప్పటికప్పుడు రియల్ టైంలో పరిశీలిస్తున్నట్టు ఇటీవల ప్రకటించింది. వ్యాక్సిన్ విడుదలను వేగవంతం చేసేందుకే మెడికల్ ఏజెన్సీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. 

మరోవంక, దేశంలోని మొత్తం 25 రాష్ట్రాలు/‌కేంద్రపాలిత ప్రాంతాల్లో క‌రోనా మ‌హ‌మ్మారి త‌గ్గుముఖం ప‌ట్టింద‌ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ ‌శాఖ ప్ర‌క‌టించింది. గ‌త వారం రోజుల‌లో 25 రాష్ట్రాలు/‌కేంద్రపాలిత ప్రాంతాల్లోని యాక్టివ్ కేసుల సంఖ్య భారీగా ప‌డిపోయింద‌ని తెలిపింది. 

రోజురోజుకు వైర‌స్ బారి నుంచి రిక‌వ‌రీ అయ్యేవారి సంఖ్య పెరుగుతుండ‌టం, మ‌ర‌ణాల రేటు కూడా భారీగా త‌గ్గ‌డం క‌రోనా యాక్టివ్ కేసులు త‌గ్గ‌డానికి కార‌ణ‌మైంద‌ని కేంద్రం ఆరోగ్య‌శాఖ ట్విట్ట‌ర్‌లో తెలిపింది.