మహాత్మాగాంధీకి ప్రధాని మోదీ నివాళి  

జాతిపిత మహాత్మాగాంధీ 151వ జయంతి వేడుకలు యావత్‌ భారతావనిలో ఘనంగా జరుగుతున్నాయి. స్వాతంత్య్ర పోరాటంలో ఆయన చూపిన మార్గం, తెగువను అందరూ స్మరించుకుంటున్నారు. ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌ వద్ద గాంధీకి ప్రధాని నరేంద్ర మోదీ ఘనంగా నివాళులర్పించారు.

యువత మహాత్ముడిని స్ఫూర్తిగా తీసుకొని ఆయన మార్గంలో నడవాలని ఆయన సూచించారు. అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్య్రాన్ని సాధించి పెట్టిన మహోన్నత వ్యక్తి మహాత్మాగాంధీ అని కొనియాడారు. 

నేడు మాజీ ప్రధాని లాల్‌బహుదూర్‌ శాస్త్రి జయంతి సైతం కావడంతో విజయ్‌ఘాట్‌ వద్ద ఆయనకు ప్రధాని మోదీతోపాటు లాల్‌బహుదూర్‌ శాస్త్రి కుమారుడు అనిల్‌ శాస్త్రి సైతం అంజలి ఘటించారు. పలువురు రాజకీయ ప్రముఖులు, నాయకులు సైతం మహాత్మా గాంధీకి, లాల్‌బహుదూర్‌ శాస్త్రికి నివాళులర్పించారు.