భారత్  సైన్యంలో చీలికలకై పాక్ కుతంత్రాలు 

భారత్ ను నేరుగా సత్తా లేదని తెలుసుకున్న పాకిస్థాన్ ఇప్పుడు కుతంత్రాల ద్వారా భారత్ సైన్యంలో కలతలు రేపేందుకు ప్రయత్నిస్తున్నది. భారత సైన్యంలో చీలికలు తెచ్చేందుకు సామాజిక మాధ్యమాల ద్వారా దుష్ప్రచారం చేస్తోంది. పాకిస్థాన్ దురుద్దేశాన్ని గమనించిన భారత సైన్యం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 

భారత సైన్యం ఈ సందర్భంగా పాకిస్థాన్‌ చర్యను  తీవ్రంగా దుయ్యబట్టింది. భారత సైన్యానికి వ్యతిరేకంగా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తోందని మండిపడింది. మరీ ముఖ్యంగా డిపార్ట్‌మెంట్ ఆఫ్ మిలిటరీ అఫైర్స్ సీనియర్ అధికారి లెఫ్టినెంట్ జనరల్ తరన్‌జిత్ సింగ్‌పై తప్పుడు ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. 

మతం ఆధారంగా భారత దేశంలో వైరుద్ధ్యాలు సృష్టించేందుకు పాకిస్థాన్ చేసిన ప్రయత్నాలు విఫలమవడంతో, తాజాగా భారత సైన్యంలో విభజన సృష్టించేందుకు నిస్సహాయంగా ప్రయత్నిస్తోందని భారత సైన్యం దుయ్యబట్టింది. 

సైన్యాన్ని అప్రతిష్ఠపాలు చేసే అటువంటి ద్వేషపూరిత ప్రయత్నాలను భారత సైన్యం నిర్ద్వంద్వంగా తిరస్కరించినట్లు స్పష్టం చేసింది. కొద్ది రోజులుగా పాకిస్థాన్ ప్రభుత్వ ఆద్వర్యంలో ద్వేషపూరిత సామాజిక మాధ్యమాల ద్వారా తప్పుడు సమాచారం ప్రచారమవుతున్నట్లు తెలిపింది.