ఇకపై రైతుల ఇంటికే ఎరువులు, ఎస్‌ఎంఎస్‌లు

రైతు సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో ముందడుగు వేశారు. రైతు భరోసా కేంద్రాల నుంచి ఎరువుల సరఫరాకు సంబంధించి రైతులకు పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (పీఓఎస్‌) వెర్షన్‌, ఎస్‌ఎంఎస్‌ సర్వీసును బుధవారం కేంద్ర మంత్రులతో కలిసి ప్రారంభించారు. 
 
కార్యక్రమంలో ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా  కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి డీవీ సదానందగౌడ, ఆ శాఖ సహాయ మంత్రి మన్‌సుఖ్‌ మాండవియా పాల్గొన్నారు. ఇక నుంచి రైతు భరోసా కేంద్రాల (ఆర్‌బీకే) నుంచి ఎరువులు కొనుగోలు చేసే రైతులకు ఎస్‌ఎంఎస్‌ ద్వారా సమాచారం అందుతుంది. అదే విధంగా ఆ ఎరువులను రైతుల ఇంటికి డోర్‌ డెలివరీ చేస్తారు.  
 
 క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య,ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  
 
ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ మీతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. నాణ్యతతో కూడిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందించడం వల్ల రైతులు అధికోత్పత్తి సాధించగలుగుతారు. అంతే కాకుండా వారికి సాగు ఖర్చు కూడా తగ్గుతుందని తెలిపారు.