
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ప్రత్యర్థి జోసెఫ్ బైడెన్ మధ్య తొలి అధ్యక్ష చర్చలో ఇద్దరూ హోరాహరీగా పలు అంశాలపై పోటీపడ్డారు. ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ నిప్పులు చెరిగారు. కరోనా మహమ్మారి, జాతివివక్ష, ఆర్థిక వ్యవస్థలకు సంబంధించిన అంశాలపై ట్రంప్, బైడెన్‌లు చర్చించారు.
సుమారు 90 నిమిషాల పాటు అత్యంత ఆసక్తికరంగా క్లీన్‌లాండ్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి క్రిస్ వాలెన్ సంధాన కర్తగా వ్యవహరించారు. రిపబ్లికన్ అభ్యర్థిగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, డెమొక్రటిక్ అభ్యర్థిగా జో బిడెన్‌లు బరిలో ఉన్న సంగతి విదితమే.
బైడెన్ ఓ దశలో అధ్యక్షుడు ట్రంప్‌ను జోకర్(క్లౌన్) అని కామెంట్ చేశారు. నోరుమూసుకోమంటూ కూడా బైడెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్ కూడా గట్టిగా బదులిస్తూ బైడెన్ కుమారుడు డ్రగ్ కేసులో దోషిగా తేలినట్లు తెలిపారు. అయితే తొలి చర్చలో బైడెన్ స్వల్ప ఆధిక్యాన్ని సాధించినట్లు ఓపీనియన్ పోల్స్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఎన్నికలకు ఇంకా 35 రోజుల సమయం ఉన్నది.
అమెరికాలో ఎన్నికలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని బైడెన్ అన్నారు. ఇప్పటికే వేల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని వ్యాఖ్యానించారు. ఒబామా కేర్ పాలసీని ట్రంప్ నాశనం చేశారని మండిపడ్డారు. బైడెన్ వ్యాఖ్యలను ట్రంప్ ఖండిస్తూ.. గత ఎన్నికల్లో గెలిచాం కాబట్టే సుప్రీంకోర్టు నియామకాల్లో తమ ప్రభుత్వానికి పూర్తి స్వేచ్ఛ ఉందని స్పష్టం చేశారు. తనను మూడేళ్ల కోసం ఎన్నుకోలేదని ధీటుగా సమాధానం ఇచ్చారు. అధ్యక్ష అభ్యర్థుల చర్చ వాడివేడిగా కొనసాగుతోంది.
ట్రంప్ తెచ్చిన హెల్త్‌స్కీమ్‌పై ఇరువురి మధ్య చర్చ జరుగుతోంది. ఒబామా కేర్‌కు ప్రత్యామ్నాయం ఎందుకు తీసుకురాలేక పోయారని బైడెన్ సూటిగా ప్రశ్నించారు. ఒబామా కేర్‌ను రద్దు చేయడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారని ఆయన విమర్శించారు. దానికి బదులుగా.. తమ ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తోందని ట్రంప్ తెలిపారు. మందుల ధరలు గణనీయంగా తగ్గాయని గుర్తు చేశారు.
చర్చలో ట్రంప్‌పై బైడెన్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. దేశంలో జాతివివక్ష విద్వేషాన్ని పెంచినట్లు ఆరోపించారు. పుతిన్‌కు కీలుబొమ్మలా ట్రంప్ వ్యవహరిస్తున్నారని బైడెన్ విమర్శించారు. అమెరికా అధ్యక్షుల్లో అత్యంత పనికిరాని అధ్యక్షుడివంటూ ట్రంప్‌పై బైడెన్ విమర్శలు చేశారు. ట్రంప్ నిర్లక్ష్యం వల్లే కరోనాతో అమెరికాలో రెండు లక్షల మంది చనిపోయినట్లు బైడెన్ ఆరోపించారు.
ట్రంప్ హయాంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని బైడెన్ అన్నారు. ట్రంప్ మట్లాడుతూ.. అమెరికా ఆర్థిక వ్యవస్థ పురోగతి సాధిస్తోందని తెలిపారు. తాము అన్ని పారదర్శక విధానాలే అవలంబిస్తున్నామని చెప్పారు. తాము ప్రజలకు కరోనా విషయంలో మెరుగైన వైద్యం అందించామని ఆయన స్పష్టం చేశారు.
స్టాక్‌మార్కెట్ల పట్ల ట్రంప్ భయపడినట్లు తెలిపారు. మరణాలను ఆపేందుకు ట్రంప్ స్మార్ట్‌గా వ్యవహరించాల్సి ఉంటుందని బైడెన్ వేసిన పంచ్‌ను తప్పుపట్టారు. స్మార్ట్ అన్న పదాన్ని తన పట్ల వాడకూడదని బైడెన్‌కు ట్రంప్ హెచ్చరించారు. వ్యాక్సిన్ గురించి కూడా ఇద్దరూ చర్చించారు. ఆర్థిక వ్యవస్థలను ఓపెన్ చేయడాన్ని బైడెన్ తప్పుపట్టారు. కానీ దేశాన్ని షట్‌డౌన్ చేయలేమని ట్రంప్ చెప్పారు.
More Stories
పాకిస్థాన్ సహా 41 దేశాలపై ట్రావెల్ బ్యాన్
ఐఎస్ఐఎస్ చీఫ్ ను హతమార్చిన అమెరికా దళాలు
గ్రీన్ కార్డు శాశ్వత నివాసానికి హామీ కాదు