చైనా విదేశాంగ మంత్రి వ్యాఖ్యలపై భారత్ ఫైర్ 

చైనా ప్రీమియర్ ఝౌ ఎన్లాని, భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూకు 7 నవంబరు 1959లో ప్రతిపాదించిన వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ)కి కట్టుబడి ఉంటామని చైనా విదేశాంగ మంత్రి చేసిన వ్యాఖ్యలపై భారత్ ఘాటుగా స్పందించింది. ఆ ప్రతిపాదనను భారత్ ఎప్పుడూ అంగీకరించలేదని స్పష్టం చేసింది.

అది ఏకపక్షంగా నిర్వచించబడిన సోకాల్డ్ ఎల్‌ఏసీ అని, తామెప్పుడూ దానిని అంగీకరించలేదని కుండబద్దలు కొట్టింది. కేవలం ఒకే ఒక్క ఎల్‌ఏసీ అంటూ చైనా పట్టుబట్టడం వివిధ ద్వైపాక్షిక ఒప్పందాల సందర్భంగా చేసుకున్న కట్టుబాట్లకు పూర్తి విరుద్ధమని ధ్వజమెత్తింది. 

తూర్పు లడఖ్‌లో ఐదు నెలలుగా భారత్-చైనా సరిహద్దు వద్ద కొనసాగుతున్న ఉద్రిక్తతలపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందిస్తూ 1959 నాటి అవగాహనకు కట్టుబడి ఉంటామని తెలిపింది. చైనా వ్యాఖ్యలపై స్పందించిన విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ 1959 నాటి ప్రతిపాదనను భారత్ ఎన్నడూ అంగీకరించలేదని స్పష్టంచేశారు.

వాస్తవాధీన రేఖ వెంబడి శాంతి సామరస్యంపై 1993 నాటి ఒప్పందం, 1996 నాటి మిలటరీ రంగంలో విశ్వాసం పాదుకొల్పే చర్యల (సీబీఎంఎస్) ఒప్పందం, 2005 నాటి సీబీఎంఎస్ ప్రొటోకాల్ అమలు ఒప్పందం, అదే ఏడాది భారతదేశం-చైనా సరిహద్దు సమస్య పరిష్కారం కోసం రాజకీయ నిర్ణయాలు, మార్గదర్శక సూత్రాల ఒప్పందాలు ఉన్నట్టు అనురాగ్ శ్రీవాస్తవ గుర్తు చేశారు. 

పశ్చిమ సెక్టార్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి వివిధ ప్రాంతాల్లో యథాతథ స్థితిని మార్చేందుకు చైనా ప్రయత్నించిందని ఆరోపించారు.