వ్యవసాయ చట్టాలు రైతులను ఎలా విముక్తి చేస్తాయి!

వ్యవసాయ చట్టాలు రైతులను ఎలా విముక్తి చేస్తాయి!

సంజు వర్మా

తమ ఉత్పత్తులను అమ్ముకోవడంలో ఎదురవుతున్న అడ్డంకుల నుండి కోట్లాది మంది రైతులను విముక్తి చేసి, మంచి ధర లభించేటట్లు చేయడం కోసం ఎన్డీయే ప్రభుత్వం తీసుకు వచ్చిన మూడు వ్యవసాయ చట్టాల గురించి చాలా చెడు ప్రచారం జరుగుతున్నది. రాజకీయ ప్రయోజనం పొందడం కోసం ప్రతిపక్షాలు రైతులను రెచ్చగొడుతున్నాయి. ఈ చట్టాల వాస్తవ ప్రభావం గురించి చూద్దాం.

1. వ్యవసాయ చట్టాల గురించి రైతులు, ముఖ్యంగా పంజాబ్ లో ఎందుకు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు?

ప్రస్తుతం పంజాబ్ వంటి రాష్ట్రాలలో ఉన్న ఎపిఎంసి (వ్యవసాయ మార్కెట్ కమిటీ)- మండి వ్యవస్థ ప్రకారం మార్కెట్ రుసుము 3 శాతం, గ్రామీణ అభివృద్ధి ఛార్జ్ 3 శాతం, దళారి (అరహతియాలు) కమీషన్ 2.5 శాతం కలుపుకొంటే 8.5 శాతం వరకు చార్జీలు అవుతాయి.

దేశంలోని ఇతర ప్రాంతాలలోకన్నా అరహతియా వ్యవస్థ పంజాబ్ లో చాల పలుకుబడి కలిగి, బలీయంగా ఉంది. అందుకనే ఈ ప్రాంతంలో ఎక్కువగా నిరసనలు జరుగుతున్నాయి.

పంజాబ్ లో పనిచేసే 40,000 మంది ఎపిఎంసి ఏజెంట్లు లేదా దళారులు గత ఏడాది కమీషన్ల రూపంలో రూ 1,600 కోట్ల మేరకు పొందారు. మరో వంక రాష్ట్ర ప్రభుత్వానికి మండి రుసుముతో రూ 1,750 కోట్లు, దాదాపు అంతే మొత్తం గ్రామీణ అభివృద్ధి ఛార్జ్ గా సమకూరింది.

ఈ దళారులే రైతులకు వడ్డీకి అప్పులిస్తుంటారు. నూతన వ్యవసాయ చట్టాలు అమలులోకి వస్తే ఈ దళారులు పట్టు కోల్పోవలసి వస్తుంది. అందుకనే ఈ నిరసనలు చేపట్టారు.

ప్రస్తుత రబి సీజన్ లో ధాన్యసేకరణ కాలాన్ని ఓ నెల రోజుల పాటు విస్తరించినా, 3,477 కొనుగోలు కేంద్రాలను (గత ఏడాది 1,849 మాత్రమే) ఏర్పాటు చేసినా ధాన్య సేకరణలో పంజాబ్ రెండో స్థానంలో మాత్రమే ఉంది. మధ్య ప్రదేశ్ మొదటి స్థానంలో ఉంటూ దేశంలోని మొత్తం గోధుల ఉత్పత్తిలో 33 శాతం మేరకు 127.62 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించింది.

ఇతర రాష్ట్రాల నుండి ఎదురవుతున్న గట్టి పోటీ కారణంగా వ్యవసాయంలో పంజాబ్ తన స్థానాన్ని కోల్పోతున్నది. ఈ చట్టాల వల్లన ఈ పోటీ మరింతగా పెరిగే అవకాశం ఉన్నదని భయపడుతున్నది.

2. ఈ చట్టాలతో రైతులకు ఏ విధంగా ప్రయోజనం కలుగుతుంది?

ఇప్పటి వరకు ఒకొక్క ప్రాంతంలో ప్రభుత్వం ప్రకటించిన ఎపిఎంసి నిర్వహించే టోకు వ్యాపార మార్కెట్ లలో తమ ఉత్పత్తులను అమ్ముకోవడం తప్ప రైతులకు మరో మార్గం లేదు.

నూతన చట్టాలతో ఈ మార్కెట్ లతో పాటు వాటి పరిధికి వెలుపల ఉండే `వాణిజ్య ప్రాంతం’లలో అమ్ముకొనే అదనపు సదుపాయం లభిస్తుంది. అక్కడ తమ ఉత్పత్తులు అమ్ముకోవడానికి లైసెన్స్ పొందిన దళారులపై ఆధారపడనవసరం ఉండదు.

స్పష్టంగా ఈ చట్టాలు పెద్ద మండీల గుత్తాధిపత్యాన్ని నీరుగారుస్తాయి. దానితో మండీల ప్రభావం తగ్గి మొత్తం మీద ఖర్చులు తగ్గుతాయి. దానితో చిన్న, సన్నకారు రైతులతో పాటు రిటైల్ వ్యాపారాలు కూడా ప్రయోజనం పొందుతారు.

3. వ్యవసాయ చట్టాల కారణంగా దీర్ఘకాలంలో, స్వల్పకాలంలో ఉండే ప్రభావం ఏమిటి?

దీర్ఘకాలంలో, దూరదృష్టి గల నరేంద్ర మోదీ ప్రభుత్వం వ్యవసాయ చట్టాలతో `వ్యవసాయ పారిశ్రామిక వేత్తలు’ అనే నూతన వర్గాన్ని రైతుల సాధికారికత ద్వారా సృష్టించడం జరుగుతుంది.

రైతులను కాంట్రాక్టు వ్యవసాయం వైపు ప్రోత్సహించడం ద్వారా వారు నేరుగా తమ ఉత్పత్తులను ఆహార ఉత్పత్తిదారులు, వ్యవసాయ సంబంధ పరిశ్రమలు లేదా ఎగుమతి దారులకు పంట రావడానికి ముందుగానే, నిర్ధేశిత ధరలో అమ్ముకొనే అవకాశం కలుగుతుంది. దానితో వ్యవసాయ ఉత్పత్తుల ధరలలో అస్థిరత నుండి వారికి రక్షణ లభిస్తుంది.

స్వల్పకాలికంలో,వ్యవసాయ చట్టాలు ఆహార గొలుసులోని వివిధ వాటాదారులపై మారిన పరిస్థితులకు అనువుగా తమను తాము సరిదిద్దుకొనే విధంగా వత్తిడి తీసుకు వస్తాయి. ఉదాహరణకు, ఎపిఎంసి మండి  బోర్డులు లేదా మార్కెటింగ్ కమిటీలు సమర్థవంతంగా, అవినీతి రహితంగా, పోటీగా మారే విధంగా వత్తిడికి గురవుతాయి.

ఇకపై సోమరిగా డబ్బు సంపాదించడం వాటికి సాధ్యం కాదు. దశాబ్దాల కాలంగా అమలులో ఉన్న చట్టాలలోని లోపాలు వారికి అనుకూలంగా ఉండడంతో ఇప్పటి వరకు అవి ఆ విధంగా కొనసాగ గలుగుతున్నాయి.

ఇప్పటి వరకు, ఈ మార్కెట్ కమిటీలు పోటీ లేకపోవడంతో తరచూ అక్రమాలకు పాల్పడుతూ, అధిక ఫీజులు, కమీషన్లను కైవసం చేసుకొంటూ కొనసాగుతూ వచ్చాయి. దానితో దురదృష్టవంతులైన రైతులకు మనం వినియోగదారులం చెల్లించే ధరలో 15 నుండి 20 శాతం మాత్రమే అందుతూ వస్తున్నది.

ప్రస్తుత మార్కెట్ వ్యవస్థలో ఏవైనా కూరగాయలు కిలోకు మనం రూ 100 చెల్లిస్తే, అందులో రైతులకు అత్యధికంగా రూ 15 నుండి రూ 20 మాత్రమే లభిస్తున్నది.  అయితే కొత్త బిల్లులు దళారుల ప్రభావాన్ని తగ్గిస్తూ ఎక్కువ డబ్బును రైతుల చేతులలో చేరే విధంగా చేయడంతో రైతులకు ఎక్కువ మొత్తం లభిస్తుంది.

వ్యవసాయ చట్టాల మరో మధ్యకాలిక ప్రభావంతో భారత ఆహార సంస్థ (ఎఫ్‌సిఐ) కార్యకలాపాలలో అసమర్థతను అరికట్టడానికి దారితీస్తుంది. దీని ద్వారా సేకరించిన ధాన్యాలు ప్రైవేటు వ్యాపారులు కొన్న దానికంటే చాలా ఖరీదైన విధానం కొనసాగదు.

ప్రస్తుత విధానం కారణంగా ప్రస్తుతం ఎఫ్‌సిఐ గిడ్డంగులలో రూ.1.5 లక్షల కోట్లు లేదా అంతకంటే ఎక్కువ విలువైన అదనపు ఆహార ధాన్యాలు మూలుగుతున్నాయి. బంపర్ గా పంటలు పండితే అవి వృద్దాగా మిగిలిపోతాయి.

4.  ఎంఎస్‌పి గురించి, ప్రభుత్వం ధన్య సేకరణ ఉండదని రైతులు ఆందోళన చెందుతున్నారు. భారత వ్యవసాయ మార్కెట్ ను పూర్తిగా `కార్పొరేటీకరణ’ లేదా `ప్రైవేటీకరణ’ కావించడంతో రైతులకు మంచి ధరలు లభిస్తాయా? 

ప్రస్తుతం నెలకొన్న ఎంఎస్‌పి, ప్రభుత్వ ధాన్య సేకరణ పద్దతులపై వ్యవసాయ చట్టాలు ఎటువంటి ప్రభావం చూపబోవని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.  ఎంఎస్‌పి సమస్యపై అనవసరమైన శ్రద్ధ చూపడం ద్వారా రైతులను తప్పుదోవ పట్టించి, మోదీ ప్రభుత్వానికి ఇబ్బందులు కలిగించడం కోసం ప్రతిపక్షాలు ప్రయత్నం చేస్తున్నాయి.

ఉదాహరణకు, శాంత కుమార్ కమిటీ నివేదిక చాలా సంవత్సరాల క్రితం భారత రైతులలో కేవలం 6% మంది మాత్రమే ఎంఎస్‌పి కార్యకలాపాల ద్వారా లబ్ది పొందారని స్పష్టం చేసింది. పైగా, భారతదేశంలోని 86% మంది చిన్న, సన్నకారు రైతులు 2 హెక్టార్లు, అంతకన్నా తక్కువ భూమిని మాత్రమే కలిగి ఉన్నారని గుర్తు చేసింది.

వీరిలో ఒక్కరు కూడా ఎంఎస్‌పి   నుండి ప్రయోజనం పొందలేదని తెలిపింది. ఈ విధానం చాలా సంవత్సరాలుగా, ధనిక రైతుల గుత్తాధిపత్యంకే దారితీస్తూ  ఎంఎస్‌పి కార్యకలాపాల అసలు ప్రయోజనాన్ని ఓడించింది.

మొత్తం వ్యవసాయ ఉత్పాదక విలువ  2019-20లో సుమారు రూ . 40 లక్షల కోట్లు కాగా, ఎంఎస్‌పి కార్యకలాపాల మొత్తం విలువ రూ రూ 2.5 లక్షల కోట్లు మాత్రమే కావడం ఈ పై వాదనను ధృవీకరిస్తుంది.  ధాన్య సేకరణ గురించి మాట్లాడుతూ, సేకరణ ప్రక్రియ మునుపటిలాగే కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేస్తున్నది.

కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు చాలావరకు వ్యవసాయ ఉత్పత్తుల ధరలు  ఎంఎస్‌పి కన్నా 15 నుండి 20 శాతం వరకు తక్కువగా ఉంటూ ఉండడంతో పి. చిదంబరం, ఇతర కాంగ్రెస్ నాయకులకు  ఎంఎస్‌పి గురించి మాట్లాడే ధైర్యం లేదు.

ఇక ప్రైవేటీకరణ అంశంకు వస్తే, భారతదేశంలో ఎఫ్‌పిఓలు ఉన్నందున, పాక్షిక ప్రైవేటీకరణ, కార్పొరేటైజేషన్ జరిగినప్పటికీ రైతులకు మంచి ధరలు లభిస్తాయి. మోదీ ప్రభుత్వం 2018 నుండి ఎఫ్‌పిఓల ఏర్పాటును ప్రోత్సహించడం ప్రారంభించింది.

ఎక్కువ వ్యాపార చతురత కలిగి ఉన్న ప్రైవేటు సంస్థలతో రైతులు ఎలా బేరాలు ఆడగలరని విమర్శకులు ఆరోపణలు చేస్తున్నారు.

బడ్జెట్ 2020 లో, రాబోయే 3 సంవత్సరాలలో 10,000 రైతు ఉత్పత్తి సంస్థలను (ఎఫ్‌పిఓ) ఏర్పాటు చేస్తున్నట్లు మోదీ  ప్రభుత్వం ప్రకటించింది. వీటిల్లో ఎక్కువగా సమూహాలు లేదా రైతుల సమూహాలు ఉంటాయి. దానితో వాటికి క్రెడిట్,   రవాణా, సాంకేతిక సహాయం వారికి విస్తరించే అవకాశం ఉంటుంది.

5. ‘ఇతర’ పంటలు లేదా ‘ఎక్కువ’ పంటలను పండించడానికి మౌలిక సదుపాయాలు లేవని చాలా మంది రైతులు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ చట్టాలు వారికి ఎటువంటి సహాయం చేస్తాయి?

భారత దేశంలోని వ్యవసాయ ఉత్పత్తులలో 46 శాతం పంటలు కాదని గమనించాలి. వాటిల్లో పాలు, చేపలు పట్టడం, అటవీ, పండ్లు, కూరగాయలు మొదలైనవి ఉంటాయి. ఈ వస్తువుల ఉత్పత్తి తృణధాన్యాలు, ధాన్యాల కన్నా ఎక్కువ, కాని ఎఫ్ అండ్ వికి ప్రభుత్వం నుండి ఎంఎస్‌పి  మద్దతు లభించదు, పాల ఉత్పత్తికి కూడా లేదు.

 అముల్ నేతృత్వంలోని సహకార ఉద్యమం కారణంగా భారతదేశ పాల పరిశ్రమ అద్భుతంగా విజయవంతమైంది. ధరల మద్దతు వల్లన కాకుండా సామర్థ్యాన్ని పెంపొందించే సౌకర్యవంతమైన,  భాగస్వామ్య వాతావరణం కారణంగా ఇది సాధ్యమైనది.

పోటీ, వ్యవస్థాపకతను ప్రోత్సహించే, ఉచిత సంస్కృతిని విడదీసే వ్యాపార-స్నేహపూర్వక పర్యావరణ వ్యవస్థను రైతులకు అందించడం ద్వారా, అత్యంత విజయవంతమైన అముల్ తరహాలో సాధికారికత పెంపొందించే వ్యవస్థలను సృష్టించడం కోసం మోదీ  ప్రభుత్వం చేసిన వ్యవసాయ చట్టాల ద్వారా ప్రయత్నిస్తున్నది.

(సంజు వర్మ ఆర్థికవేత్త, బిజెపి జాతీయ అధికార ప్రతినిధి)