దగ్గుబాటి పురంధేశ్వరికి కరోనా పాజిటివ్‌ 

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి కరోనా బారిన పడ్డారు. ఆమె వైరస్ లక్షణాలతో బాధపడుతున్నారు. దీంతో ఆమె హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. 

కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ సమయంలో ఆమె పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు. అయితే ఈ మధ్య కాలంలో ఏపీ బీజేపీ చేపట్టిన వివిధ కార్యక్రమాల్లో పురంధేశ్వరి చురుగ్గా పాల్గొంటున్నారు.

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పురంధేశ్వరి నియమించిన తర్వాత ఆమె తన స్వగ్రామంలోనే ఉన్నారు. అయితే పార్టీ పదవి ఇచ్చిన నేపథ్యంలో ఆమెను అభినందించడానికి నాయకులు, అనేకమంది కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చి పురంధేశ్వరిని కలిశారు. 

ఈ నేపథ్యంలో ఆమెకు కరోనా సోకినట్లు కుటుంబసభ్యులు, పార్టీ శ్రేణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల క్రితం ఆమె ఢిల్లీ వెళ్లి వచ్చారు. అనారోగ్యంగా ఉండడంతో ఆమె పరీక్షలు చేయించుకోగా పాజిటీవ్ వచ్చింది. దీంతో వెంటనే ఆమె హైదరాబాద్‌లోని కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలియవచ్చింది. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు చెబుతున్నారు. 

ఆమె మొదట హోంక్వారంటైన్‌లో ఉండాలని భావించారు. కానీ.. జ్వరం, దగ్గు తీవ్రంగా ఉండటంతో కుటుంబసభ్యుల సూచనమేరకు ఆస్పత్రిలో చేరారు. కాగా.. కరోనా పాజిటివ్ రావడంతో.. తనతో కాంటాక్ట్‌లో ఉన్నవాళ్లందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆమె కోరారు.