బ్ర‌హ్మోస్ క్షిప‌ణి ప‌రీక్ష విజ‌య‌వంతం

బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ మిసైల్ ప్రయోగాత్మక పరీక్ష బుధవారం  విజయవంతమైంది. దీంతో భారత దేశ రక్షణ వ్యవస్థ మరింత పరిపుష్టమైంది. 400 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగల సామర్థ్యం ఈ మిసైల్‌కు ఉంది. ఒడిశాలోని ఓ కేంద్రం నుంచి భూమిపై నుంచి దీనిని ప్రయోగించారు.

దీనిని అభివృద్ధిపరచిన శాస్త్రవేత్తల బృందాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) చైర్మన్ డాక్టర్ జి సతీష్ రెడ్డి అభినందించారు. ఈ పరీక్ష విజయవంతం కావడం సూపర్‌సోనిక్ క్రూయిజ్ మిసైల్‌కు దేశీయ సత్తా జతకూడటానికి బాటలు పరుస్తుందని చెప్పారు.

డీఆర్‌డీవో పీజే-10 ప్రాజెక్టు క్రింద ఈ పరీక్షను నిర్వహించినట్లు తెలిపారు. దేశీయ బూస్టర్‌తో దీనిని నిర్వహించారు. లక్ష్య పరిథిని పెంచి అభివృద్ధిపరచిన ఈ మిసైల్‌ను ప్రయోగించడం ఇది రెండోసారి. దీనికి దేశీయంగా అభివృద్ధిపరచిన ఎయిర్‌ఫ్రేమ్, బూస్టర్ ఉపయోగించారు.

బ్రహ్మోస్ అనేది రామ్‌జెట్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ మిసైల్. దీనిని జలాంతర్గాములు, నౌకలు, యుద్ధ విమానాల నుంచి, భూమిపై నుంచి ప్రయోగించవచ్చు. రష్యాలోని ఓ సంస్థతో కలిసి డీఆర్‌డీవో దీనిని అభివృద్ధిపరిచింది.  బ్రహ్మోస్ ఫస్ట్ వెర్షన్‌ను భారత నావికా దళంలో 2005లో ప్రవేశపెట్టారు. మొట్ట మొదట ఐఎన్ఎస్ రాజ్‌పుట్‌‌ నౌకలో దీనిని ఏర్పాటు చేశారు.