ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అమలు పరుస్తున్న ఖరీఫ్ సీజన్ పంటల బీమా డైలమాలో పడింది. మరో నాలుగు రోజుల్లో సీజన్ ముగుస్తున్నప్పటికీ బీమా నోటిఫికేషన్ ఇంకా వెలువడలేదు. సాధారణంగా మే, జూన్ మాసాల్లో నోటిఫికేషన్‌లు వెలువడేవి. ఈ మారు బీమా అమలును ఇ-క్రాప్ బుకింగ్‌తో ముడిపెట్టడంతో సెప్టెంబర్ నాలుగోవారంలో సైతం నోటిఫికేషన్ రాలేదని తెలుస్తున్నది.
ముందస్తు ఖరీఫ్ పంటలు కోతకొస్తున్నా బీమా నిర్ధారణ కాలేదు. భారీ వర్షాలు, వరదలు, కరువు తదితర విపత్తులచ్చి పంటలు దెబ్బతింటుండగా బీమా నోటిఫికేషన్ వ్యవహారం తేలకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
వైసిపి ప్రభుత్వం రాకమునుపు వరకు ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పిఎంఎఫ్‌బివై), పునర్వ్యస్థీకరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా (ఆర్‌డబ్ల్యుబిసిఐ) ఎపిలో అమల్లో ఉన్నాయి. ఇన్సూరెన్స్ నిర్వహణ ఏజెన్సీలుగా ప్రభుత్వరంగంలోని జాతీయ వ్యవసాయ బీమా కార్పొరేషన్ (ఎఐసి)తో పాటు ప్రైవేటు బీమా సంస్థలను నరేంద్ర మోదీ ప్రభుత్వం 2016లో రంగంలోకి దించింది.
వైసిపి ప్రభుత్వం గత రబీ నుంచి రాష్ట్ర వ్యవసాయ శాఖనే నిర్వహణ ఏజెన్సీగా పెట్టి ఇన్సూరెన్స్‌ను అమలు చేయనారంభించింది. గతంలో రైతులు చెల్లించాల్సిన ప్రీమియంలో సగం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భరించేవి. మిగతా సగం రైతులు చెల్లించేవారు. రైతులు చెల్లించాల్సిన ప్రీమియం వాటాను సైతం రాష్ట్రమే కడతానంది. అయితే ఇ-క్రాప్ బుకింగ్ చేయించుకున్న వారికి మాత్రమేనంది.
గ్రామ సచివాలయంలోని వ్యవసాయ సిబ్బంది పొలాల వద్దకెళ్లి రైతు ఫోటోలతో సహా పంట, సర్వేనెంబర్, పట్టాదార్ ప్యాస్ పుస్తకం, తదితర వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలి. ఆగస్టు నెలాఖరు వరకు బుకింగ్‌కు గడువు విధించగా, అప్పటికి 40-50 శాతం వరకు నమోదులు కాకపోవడంతో, ఈ నెలాఖరుకు గడువు పెంచారు.
ఇప్పటికీ 70-80 శాతం మేరకే బుకింగ్‌లు పూర్తయ్యాయని, కొన్ని జిల్లాల్లో అంతకంటే తక్కువగా నమోదులున్నాయని తెలుస్తున్నది. ఇ-క్రాప్ బుకింగ్ పూర్తి కానందున ఏ జిల్లాలో ఏ పంటలకు ఏ బీమా వర్తిస్తుందో నిర్ధారించే నోటిఫికేషన్ ఇవ్వలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. పంటల బీమా అమలుపై జులై 27న జరిగిన రాష్ట్ర స్థాయి కోర్డినేషన్ కమిటీ సమావేశంలో ప్రతిపాదనలు చేసినా జిఓ రాలేదు.
More Stories
పోలవరంకు కేంద్రం రూ.2,800 కోట్లు విడుదల
‘స్వర్ణాంధ్ర విజన్’ సాకారానికి సహకరించండి
ధర్మవరంలో “హ్యాండ్లూమ్ క్లస్టర్” ఏర్పరచాలి