ఇకెంతకాలం భారత్‌ ను దూరంగా  ఉంచుతారు?  

ఐక్యరాజ్య సమితి కీలక విధాన నిర్ణయక వ్యవస్థలలో భారత్‌ను ఎంతకాలమని దూరం పెడుతారని ప్రధాని నరేంద్ర మోడీ నిలదీశారు. నిర్ణయాధికారం లేకుండా భారత్‌ను సందిగ్థావస్థలో పెడుతారని ప్రశ్నించారు. ఇప్పుడు సాగుతోన్న ఐరాస 75వ వార్షిక సర్వప్రతినిధి సభ నుద్ధేశించి శనివారం భారత ప్రధాని వీడియో సందేశం ఇస్తూ సంస్కరణల ప్రక్రియను సంస్థ మరింత వేగవంతం చేయాలని ప్రధాని డిమాండ్ చేశారు. 

సంస్కరణలు పూర్తిగా సమకాలీన వాస్తవికతల కోణంలో ఉండాలని సూచించారు. వాస్తవికతకు తావులేకుండా, కార్యాచరణకు వెళ్లకుండా ఎంతకాలం సాగదీస్తారని నిలదీశారు. భద్రతా మండలిలో భారతదేశానికి శాశ్వత సభ్యత్వం అత్యవసరం అని తాము దీనిని పునరుద్ఘాటిస్తున్నామని తెలిపారు. నిర్ణయాల ఖరారు, విధానాల రూపకల్పనలో కీలకమైన మండలి వంటి వాటికి భారత్‌ను ఎంతకాలం దూరం పెట్టాలని అనుకుంటున్నారని నిలదీశారు. 

ప్రపంచ దేశాల ప్రాతినిధ్యపు సంస్థలో ఇప్పటికైనా తగు సంస్కరణల ప్రక్రియ అవసరం అని ప్రధాని స్పష్టం చేశారు. అత్యున్నత విధాన నిర్ణాయక సంస్థలకు సంబంధించి భారత్‌ను ఇంకా ఎంతకాలం వెలివేసినట్లుగా ఉంచుతారని ప్రశ్నించారు. సంస్కరణల ప్రక్రియ ఎంతకాలం చర్చల దశలోనే ఉంటుంది? దీనికి ఓ నిర్థిష్టమైన సరైన ముగింపు దక్కుతుందా? అని తమ దేశ ప్రజలు ఆందోళన చెందుతున్నారని తెలిపారు.

సంస్కరణలు శీఘ్రంగా పూర్తి కావాలని చిరకాలంగా తమ దేశ ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. ఇప్పటికీ భారత్ పట్ల చిన్నచూపు ప్రదర్శించడం అనుచితమేనని, ఈ ధోరణి ఎప్పటికీ ముగుస్తుందని ప్రశ్నించారు.చర్చలు జరుగుతున్నాయని అంటున్నారని, ఏకాభిప్రాయ సాధన అవసరం అంటున్నారని,అయితే కనీసం ఇప్పటికీ సంప్రదింపుల పత్రం లేదా సంస్కరణల విషయంలో పురోగతిని తెలిపే ప్రక్రియ ఏదీ లేదన్నారు.

ఈ వేదిక నుంచే ప్రధాని మోడీ కోవిడ్ 19 మహమ్మారిపై ఐరాస పోరు తీరుతెన్నులను నిలదీశారు. గత 8 లేదా 9 నెలలుగా ప్రపంచం అంతా కూడా ఈ కరోనావైరస్‌తో పోరాడుతోందని, ఇది నిజానికి ఓ ఉమ్మడిపోరుగానే ఉందని, కానీ ఈ దిశలో ఐరాస పాత్ర ఏమిటని ప్రశ్నించారు. ఈ ప్రపంచ సంస్థ ఈ అత్యంత ప్రధానమైన సమస్యపై ఏ మేరకు సమర్థవంతంగా వ్యవహరిస్తోందనేది వెల్లడికావల్సి ఉందని స్పష్టం చేశారు. 

వర్తమాన వాస్తవికతలతో నిమిత్తం లేకుండా ఐరాస సాగుతోందని ప్రధాని విమర్శించారు. కోవిడ్ 19 వందేళ్లలో ఎప్పుడూ లేని విధంగా ప్రపంచాన్ని కబళించిందని, ప్రపంచ దేశాలన్ని సంఘటితంగానే పోరు సల్పుతూ ఉంటే ఐరాస ఇందులో ఏం పాత్ర పోషిస్తోందని ప్రశ్నించారు. కరోనాపై పోరువిషయంలో ఐరాస నాయకత్వం వహించాల్సిన బాధ్యత లేదా? అని ప్రశ్నించారు. మహమ్మారి ఆటకట్టు దిశలో ఐరాస తొలిదశలో సరైన విధంగా వ్యవహరించలేదనే విమర్శలు వచ్చిన విషయాన్ని ప్రధాని ప్రస్తావించారు.