కేంద్ర మాజీ మంత్రి జ‌శ్వంత్ సింగ్ క‌న్నుమూత‌

కేంద్ర మాజీ మంత్రి జ‌శ్వంత్ సింగ్ క‌న్నుమూశారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. దీంతో జూన్ 25న ఢిల్లీలోని ఆర్మీ ద‌వాఖాన‌లో మ‌ల్టీఆర్గాన్ డిసిన్ఫెక్ష‌న్ సిండ్రోమ్ సెప్సిస్ చికిత్స పొందుతున్నారు. ప‌రిస్థితి విష‌మించ‌డంతో ఈరోజు ఉద‌యం 6.55కు తుదిశ్వాస విడిచార‌ని వైద్యులు ప్ర‌క‌టించారు.
 
దశాబ్దాలపాటు భారత్ ను శత్రువుగా పరిగణిస్తూ పాకిస్తాన్ ను మిత్రదేశంగా భావిస్తున్న అమెరికా వైఖరిలో మార్పు తీసుకు వచ్చి, భారత్ తో సంబంధాలు మెరుగుపరచుకొనేటట్లు చేయడంతో విదేశాంగ మంత్రిగా జస్వంత్ సింగ్ కీలక భూమిక వహించారు. 
 
కార్గిల్ యుద్ధ సమయంలో పాకిస్తాన్ ను అంతర్జాతీయంగా ఏకాకిగా చేయడం, చైనా మాట్లాడలేని పరిస్థితులు కల్పించడం, మొత్తం ప్రపంచం భారత్ కు బాసటగా నిలబడే విధంగా చేయడంలో అనూహ్యమైన దౌత్యనీతిని ప్రదర్శించారు. 
 
అప్పటి వరకు రష్యాకు అనుకూలంగా, అమెరికాకు వ్యతిరేకంగా ఉంటూ వస్తున్న భారత విదేశాంగ విధానాన్ని సమూలంగా మార్చివేసి, అంతర్జాతీయంగా భారత్ కీలక భూమిక వహించే విధంగా చేయగలిగారు. అదే విధంగా ఆర్ధిక మంత్రిగా కీలకమైన ఆర్ధిక సంస్కరణలు తీసుకు రావడంలో, ప్రభుత్వ పాలనలో పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వడంలో విశేషమైన కృషి చేశారు. 
భారత్ అణుపరీక్షల తర్వాత భారత్ పై విధించిన ఆంక్షలు, ఆ విషయంలో అమెరికాను ఒప్పించే విషయంలోనైనా, బ్రిటన్ తో చర్చల విషయంలోనైనా, ఎన్డీయేలో చేరే విషయంలో జయలలితతో సంప్రదించే విషయమైనా ఇలా ఏ విషయమైనా నాటి ప్రధాని వాజ్‌పాయ్ జశ్వంత్ సింగ్ కే అప్పజెప్పేవారు.
 
1938, జ‌న‌వ‌రి 3న రాజ‌స్థాన్‌లోని జ‌సోల్‌లో జ‌శ్వంత్ సింగ్ జ‌న్మించారు. త‌న సుదీర్ఘ రాజ‌కీయ జీవితంలో ప‌లుమార్లు కేంద్ర‌మంత్రిగా ప‌నిచేశారు. మాజీ ప్ర‌ధాని వాజ్‌పేయీ హ‌యాంలో ర‌క్ష‌ణ‌, ఆర్థిక‌, విదేశాంగ శాఖ మంత్రిగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు. 1980 నుంచి 2014 వ‌ర‌కు పార్ల‌మెంట్ స‌భ్యునిగా ఉన్నారు. 
 
ఐదుసార్లు రాజ్య‌స‌భ స‌భ్యుడిగా, నాలుగుసార్లు లోక్‌స‌భ స‌భ్యుడిగా ఎన్నిక‌య్యారు. 1998-99 వ‌ర‌కు ప్ర‌ణాళిక సంఘం ఉపాధ్య‌క్షుడిగా ప‌నిచేశారు. 2004-2009 వ‌ర‌కు రాజ్య‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నేత‌గా వ్యవ‌హ‌రించారు.  లోతయిన విషయం పరిజ్ఞానం, అధ్యయనంలతో మంచి మేధావిగా పేరొందారు. రాజకీయాలకు అతీతంగా గౌరవం పొందగలిగారు. 
 
జ‌శ్వంత్‌సింగ్ మృతిప‌ట్ల ప్ర‌ధాని మోదీ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. జ‌శ్వంత్ సింగ్ సైనికుడిగా, రాజ‌కీయ నేత‌గా దేశానికి సేవలందించార‌ని చెప్పారు. దేశ రాజ‌కీయాల్లో ఆయ‌న‌ది సుదీర్ఘ అనుబంధ‌మ‌ని తెలిపారు. 
 
మాజీ ప్ర‌ధాని అట‌ల్ బిహారీ వాజ్‌పేయి ప్ర‌భుత్వంలో ఆయ‌న ప్ర‌ధాన‌‌పాత్ర పోషించార‌ని గుర్తు చేశారు. కీల‌క‌మైన ఆర్థిక‌, ర‌క్ష‌ణ‌, విదేశీ వ్య‌వ‌హారాల శాఖ‌ల మంత్రిగా ప‌నిచేసి త‌న‌దైన ముద్ర‌వేశార‌ని చెప్పారు. ఈమేర‌కు ప్ర‌ధాని ట్వీట్ చేశారు. 
 
జ‌శ్వంత్ సింగ్ మృతిప‌ట్ల ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంతాపం తెలిపారు. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. రాజ‌స్థాన్ రాజ‌కీయాల్లో జ‌శ్వంత్‌సింగ్ కీల‌క‌పాత్ర పోషించారని ట్వీట్ చేశారు.