దక్షిణ కొరియాకు కిమ్ జోంగ్ ఉన్ క్షమాపణ

కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు ఓ దక్షిణ కొరియా వ్యక్తిని హత్య చేసినందుకు ఆ దేశానికి ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ క్షమాపణ చెప్పారు. 

ఈ విధంగా ఓ వ్యక్తిని కాల్చి చంపడంపై రాజకీయంగా, ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్న తరుణంలో దక్షిణ కొరియా జాతీయ భద్రతా సలహాదారు సుహ్ హూన్ ఈ విషయాన్ని వెల్లడించారు.

ఉత్తర కొరియా సరిహద్దు దేశాలతో సంబంధాలను పర్యవేక్షిస్తున్న యునైటెడ్ ఫ్రంట్ డిపార్ట్‌మెంట్ నుంచి క్షమాపణ లేఖ దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే-ఇన్‌కు అందినట్లు తెలిపారు. 

తమ దేశానికి చెందిన ఓ వ్యక్తిని ఉత్తర కొరియా సైనికులు కాల్చి చంపినట్లు దక్షిణ కొరియా ఆరోపించింది. ఆ వ్యక్తి మృతదేహాన్ని పెట్రోలు పోసి తగులబెట్టారని పేర్కొంది. ఈ సంఘటనపై దక్షిణ కొరియాలో తీవ్ర ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. దేశాధ్యక్షుడు మూన్‌పై రాజకీయంగా ఒత్తిడి పెరుగుతోంది. 

ఈ సంఘటనపై వివరణ ఇవ్వాలని, మరోసారి ఇటువంటి సంఘటనలు జరగబోవని హామీ ఇవ్వాలని దక్షిణ కొరియా కోరినట్లు సుహ్ చెప్పారు. ఈ నేపథ్యంలోనే కిమ్ జోంగ్ ఉన్ ప్రభుత్వం క్షమాపణ లేఖ రాసిందని చెప్పారు. 

ఇరు దేశాల మధ్య నమ్మకాన్ని పెంచుకోవడానికి ఇటీవల జరుగుతున్న కృషికి ఈ సంఘటన ఆటంకం కాబోదనే ఆశాభావాన్ని ఉత్తర కొరియా వ్యక్తం చేసినట్లు సుహ్ తెలిపారు. మూన్, కిమ్ ఈ నెలలో ఉత్తర, ప్రత్యుత్తరాలు జరిపినట్లు చెప్పారు.