చైనా గత కొన్నేండ్లుగా సుమారు 16 వేల మసీదులను కూల్చివేసిందని ఆస్ట్రేలియాకు చెందిన ఒక సంస్థ తన నివేదికలో పేర్కొంది. జిన్జియాంగ్ ప్రాంతంలోని చైనా అధికారులు ఈ దురాగతాలకు పాల్పడ్డారని, పది లక్షల మంది ఉయ్ఘర్లు, టర్కీ మాట్లాడే ముస్లిం ప్రజలను శిబిరాల్లో ఉంచారని, ముస్లిం సంప్రదాయాలు, మతపరమైన కార్యక్రమాలు నిర్వహించకుండా అడ్డుకున్నారని, మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడ్డారని ఆ నివేదిక ఆరోపించింది.
జిన్జియాంగ్ ప్రాంతంలో సుమారు 16 వేల మసీదులను చైనా కూల్చివేసినట్లు శాటిలైట్ చిత్రాలు, పవిత్ర కట్టడాల స్థలాలకు చెందిన వందలాది డాకుమెంట్ల ద్వారా అంచనా వేస్తున్నట్లు ఆస్ట్రేలియన్ స్ట్రాటజిక్ పాలసీ ఇన్సిస్టిట్యూట్ (ఏఎస్‌పీఐ) తన నివేదికలో పేర్కొంది.
గత మూడేండ్లలో ఈ కూల్చివేతలు జరిగాయని, సుమారు 8,500 మసీదులను పూర్తిగా కూల్చివేసినట్లు తెలుస్తున్నదని, ఉరుంకి, కష్గర్ పట్టణ కేంద్రాల వెలుపల ఈ కూల్చివేతలు ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించింది.
కూల్చివేతల నుంచి మసీదులను రక్షించుకునేందుకు చాలా వాటికి డోములు, మినార్లను తొలగించారని, ప్రస్తుతం జిన్జియాంగ్ ప్రాంతంలో ఇలాంటి మసీదులు 15,500 కన్నా తక్కువగా ఉన్నట్లు ఒక పరిశోధనలో గుర్తించినట్లు ఆ నివేదికలో తెలిపారు.
చైనాలో 1960 నాటి సాంస్కృతిక విప్లవం అనంతరం ప్రస్తుతం అక్కడ ముస్లిం మతాన్ని ఆచరించే కుటుంబాలు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయని, మూడొంతులు ముస్లిం ప్రార్థనా స్థలాలు ధ్వంసమయ్యాయని ఆరోపించింది.
అయితే అక్కడి చర్చిలు లేదా బౌద్ధ ఆలయాలకు ఎలాంటి నష్టం జరుగలేదని పేర్కొంది. గతం కంటే ఎక్కువ సంఖ్యలో అక్కడ నిర్బంధ శిబిరాలు ఉన్నట్లు ఆ నివేదిక వెల్లడించింది. మరోవైపు ఈ నివేదికను చైనా ఖండించింది. జిన్జియాంగ్ వాసులు మత స్వేచ్ఛను పూర్తిగా ఆస్వాదిస్తున్నారని పేర్కొంది.
ఏఎస్‌పీఐ నివేదిక అంతా అబద్ధాలతో కూడినదని, చైనాకు వ్యతిరేకంగా తయారు చేసినదని అని ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్బిన్ ఖండించారు. ఆ ప్రాంతంలో 24 వేలకుపైగా మసీదులు ఉన్నాయని ఆయన చెప్పారు.
అమెరికాలో ఉన్న వాటి కంటే పది రెట్లు ఎక్కువని, ప్రపంచంలోని పలు ముస్లిం దేశాల్లోని సగటు ముస్లిం వ్యక్తులకు ఉన్న మసీదులు కన్నా ఇక్కడ ఎక్కువగానే ఉన్నాయని వెల్లడించారు. పేదరికం, ఉగ్రవాద వ్యతిరేకత కార్యక్రమాల నియంత్రణకు అక్కడ నిర్వహిస్తున్న శిక్షణ శిబిరాలు ఎంతో అవసరమని పేర్కొన్నారు.
More Stories
లైంగిక వేధింపుల ఆరోపణలతో జానీ మాస్టర్ పై జనసేన వేటు
సామరస్యంతోఅస్పృస్యతను పూర్తిగా నిర్ములించాలి
డొనాల్డ్ ట్రంప్ సమీపంలో కాల్పులు.. మరోసారి హత్యాయత్నం?