
ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సంచలనం కలిగించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక ఆధారాలు సేకరించడంలో ప్రస్తుతం దర్యాప్తు జరుపుతున్న సిబిఐ విజయం సాధించినట్లు తెలుస్తున్నది. అప్పట్లో ఈ ఉదంతం కేంద్రంగా వైసీపీ, టీడీపీ మధ్య ఆరోపణలు, పత్యారోపణలు వచ్చాయి.
ఈ తరుణంలో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా విచారణలో పురోగతి సాధించలేదు. ప్రతిపక్షంలో ఉండగా సిబిఐ దర్యాప్తు కోరుతూ హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేసిన జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యతిరేకించారు. అయితే వివేకా కూతురు సీబీఐ విచారణ కోరుతూ హైకోర్టును ఆశ్రయించడంతో సిబిఐ దర్యాప్తు తప్పలేదు.
దూకుడుగా దర్యాప్తు జరుపుతున్న సిబిఐ పలు కీలక ఆధారాలు సేకరిస్తూ, పలువురిని విచారిస్తున్నది. ఈ క్రమంలోనే మరొక కొత్తపేరు తెరపైకి వచ్చింది. మున్నా అనే వ్యక్తి పేరు ఉండటంతో అతని కుటుంబ సభ్యులను విచారించి వారి కదలికలపై నిఘా పెట్టారు.
పులివెందులలో చెప్పుల దుకాణం నడుపుకునే మున్నా బ్యాంకు ఖాతాలో భారీ ఎత్తున నగదు, నగలు ఉండటం సీబీఐ అధికారులు గమనించారు. ఏకంగా రూ. 48 లక్షల నగదు, 25 తులాల బంగారం, రూ. 20 లక్షల ఎఫ్‌డీలు ఉండటంతో ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు.
మున్నాకు వివేకానంద రెడ్డి సన్నిహితుడిగా ఉండేవారని చెబుతున్నారు. అతని కుటుంభం వివాదాల్లో వైఎస్ వివేకాందరెడ్డి కలగజేసుకున్నట్లు సమాచారం . మున్నా మూడు వివాహాలు చేసుకోవడంతో దీనిపై మందలించినట్లు ప్రచారం జరుగుతున్నది.
ఈ క్రమంలోనే మున్నా మొదటి భార్యను విచారించగా నగదు విషయం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే సీబీఐ అధికారులు ఎంపీ అవినాష్ రెడ్డి సన్నిహితుడు ఉదయ్ కుమార్ రెడ్డిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అవినాష్ రెడ్డి జగన్ కు సన్నిహితుడిగా పేరొందారు.
More Stories
పహల్గాం ఉగ్రదాడిలో హమాస్ హస్తం?
కాశ్మీర్ లోయలో ఐదుగురు ఉగ్రవాదుల ఇళ్ల పేల్చివేత
ఏపీ పట్టణాల్లో స్లీపర్‌సెల్స్ పై పోలీసుల డేగకన్ను