సార్క్ సవాళ్ళలో సరిహద్దు ఉగ్రవాదం కీలకం

సరిహద్దు ఉగ్రవాదం, రవాణా మార్గాలు, వ్యాణిజ్యాన్ని అడ్డుకోవడం వంటివి సార్క్‌ సవాళ్లలో కీలకమైనవని విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ తెలిపారు. ఈ సవాళ్లను అదిగమించినప్పుడే దక్షియాసియా ప్రాంతంలో శాంతి, శ్రేయస్సు, భధ్రత శాశ్వతంగా ఉంటాయని ఆయన చెప్పారు. 

గురువారం ఆన్‌లైన్‌లో జరిగిన సార్క్‌ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశంలో మాట్లాడుతూ గత 35 సంవత్సరాలుగా, సార్క్ గణనీయమైన పురోగతి సాధించిందని జైశంకర్‌ చెప్పారు. అయితే పరస్పర సహకారం, శ్రేయస్సు కోసం భారత్‌ చేస్తున్న ప్రయత్నాలకు ఉగ్రవాద చర్యలు, జాతీయ భద్రతకు ముప్పు వంటివి అవరోధంగా మారయంటూ పరోక్షంగా పాకిస్థాన్‌పై మండిపడ్డారు. 

దక్షిణాసియా పురోగతి, భద్రత, సమగ్రత కోసం పొరుగు దేశానికి మొదటి ప్రాధాన్యత అన్న విధానానికి భారత్‌ కట్టుబడి ఉన్నదని చెప్పారు. కరోనా నేపథ్యంలో సార్క్‌ దేశాలకు తక్షణ సహాయం, అత్యవసర మందులు, పరీక్ష కోసం కోసం పది మిలియన్‌ డాలర్ల అత్యవసర నిధి ఏర్పాటు నిబద్ధతకు కూడా భారత్‌ కట్టుబడి ఉన్నదని జైశంకర్‌ తెలిపారు.

కరోనాపై సమాచారం మార్పిడిని మరింత సులభతరం చేసేందుకు కోవిడ్ -19 ఇన్ఫర్మేషన్ ఎక్స్ఛేంజ్ ప్లాట్‌ఫామ్ (కోయినెక్స్)ను భారత్‌ ప్రారంభించిందని చెప్పారు. సార్క్ విపత్తు నిర్వహణ కేంద్రం ఆధ్వర్యంలో వినూత్న వెబ్‌సైట్ అభివృద్ధికి ఇది  దోహదపడిందని పేర్కొన్నారు.

కరోనా మహమ్మారి ప్రభావాన్ని తగ్గించేందుకు సార్క్ ఫుడ్‌ బ్యాంక్‌ విధానం కోసం కూడా ఈ వ్యవస్థ ఉపయోగపడుతుందని జైశంకర్‌ తెలిపారు. సార్క్‌ పొరుగుదేశాలైన మల్దీవులకు 150 మిలియన్‌ అమెరికా డాలర్లు, భూటాన్‌కు 200 మిలియన్‌ అమెరికా డాలర్లు, శ్రీలంకకు 400 మిలియన్‌ అమెరికా డాలర్ల సహాయ నిధిని ఈ ఏడాది భారత్‌ అందజేస్తుందని ఆయన చెప్పారు.

మరోవైపు 19వ సార్క్‌ సమిట్‌ నిర్వహణకు తాము సిద్ధంగా ఉన్నామని పాకిస్థాన్‌ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషి ఈ సందర్భంగా తెలిపారు. సార్క్‌ పనితీరులో ఎదురైన ఆటంకాలు దీని ద్వారా తొలగుతాయని ఆయన చెప్పారు. 

కాగా, 2016 నంవంబర్‌లో ఇస్లామాబాద్‌లో సార్క్‌ సదస్సు జరుగాల్సి ఉండగా కశ్మీర్‌లోని ఉరీలో భారత ఆర్మీ శిబిరంపై ఉగ్రదాడి జరుగడంతో ఈ సదస్సును భారత్‌ బహిష్కరించగా మెజార్టీ సభ్య దేశాలు మద్దుతు పలికాయి. నాటి నుంచి సార్క్‌ నిద్రాణస్థితిలో ఉన్నది.