సభ్యుల సస్పెన్షన్ బాధాకరమే, కానీ తప్పలేదు 

నియమ, నిబంధలనకు అనుగుణంగా పార్లమెంటు ఎగువసభను నడుపుతూ సభా గౌరవాన్ని కాపాడటం తన ధర్మమని రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్యనాయుడు తెలిపారు. దానితో కొందరు సభ్యులపై సస్పెన్షన్ విధింపు బాధాకరమే అయినప్పటికీ సభా నియమాలను ఉల్లంఘించడమే కాకుండా సభా మర్యాదాలను కాలరాసిన వారి విషయంలో ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని ఆయన స్పష్టం చేశారు.
అనుకున్న కాలపరిమితి కంటే ఎనిమిది రోజుల ముందే రాజ్యసభను నిరవధిక వాయిదా వేసే ముందు చైర్మన్ సభనుద్దేశించి ప్రసంగించారు. నిరసనను తెలియజేసే హక్కు విపక్షాలకు ఉంటుందని అయితే, ఏ విధంగా నిరసన తెలియజేస్తున్నారనే విషయంపై ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు.
సిద్ధాంత వైరుధ్యాలను వెల్లడించేందుకు రాజ్యసభ ఒక చక్కని వేదికన్న చైర్మన్.. దీర్ఘకాలం పాటు సభను బహిష్కరించడం వల్ల విపక్ష సభ్యులు తమ ఆలోచనలను, సిద్ధాంతాలను సభ ద్వారా సమర్థంగా ప్రజలకు వెల్లడించే చక్కటి అవకాశాన్ని కోల్పోతారని పేర్కొన్నారు.
మూడు శ్రామిక చట్టాలను ఆమోదించవద్దంటూ విపక్షనేత గులాంనబీ ఆజాద్, ఇతర సభ్యులు రాసిన లేఖను ఉటంకిస్తూ.. సభ చరిత్రలో సభ్యులు కార్యక్రమాలను బహిష్కరించినపుడు, వాకౌట్ చేసినపుడు కూడా సభాకార్యక్రమాలు యథావిధిగా జరుగడం, వివిధ బిల్లులు ఆమోదం పొందిన సందర్భాలను గుర్తుచేశారు.
ఈసారి సమావేశాలు ఉత్పాదకత విషయంలో సంతృప్తికరంగానే సాగాయని.. కొన్ని అంశాలు ఆవేదన కలిగించాయని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. ‘భవిష్యత్తు మంచిగా ఉండాలంటే మనమంతా సంయుక్తంగా ఆలోచించాల్సిన అవసరముంది’ అని పిలుపునిచ్చారు.
రాజ్యసభ చరిత్రలో తొలిసారిగా సభ డిప్యూటీ చైర్మన్‌ను తొలగించాలంటూ దాఖలైన తీర్మానాన్ని తిరస్కరించడం జరిగిందని.. నియమావళి ప్రకారం 14రోజుల ముందుగా ఈ నోటీసు ఇవ్వనందునే.. ఈ విజ్ఞప్తిని తిరస్కరించినట్లు ఆయన స్పష్టం చేశారు.
కరోనా మహమ్మారి నేపథ్యంలో రాజ్యసభ చరిత్రలో తొలిసారిగా ఈ సమావేశాలు 10 రోజులపాటు ఆరు వేర్వేరు ప్రాంతాలనుంచి జరిగిన విషయాన్ని వెంకయ్య నాయుడు గుర్తుచేశారు. ఈ సమావేశాల్లో 25 బిల్లులు ఆమోదం పొందగా.. 6 బిల్లులను కొత్తగా ప్రవేశపెట్టినట్లు చైర్మన్ వెల్లడించారు.
సభ 100.69% ఉత్పాదకతను నమోదు చేసిందన్నారు. ఈ సమావేశాల్లో.. సభ్యులు అడిగిన 1,567 ప్రశ్నలకు లిఖితపూర్వక సమాధానాలు అందాయని, సభ్యులు 92 శూన్యకాల, 66 ప్రత్యేక ప్రస్తావ తీర్మానాల ద్వారా సభ్యులు అత్యవసర ప్రజోపయోగ అంశాలను లేవనెత్తారని వెల్లడించారు.
కరోనాపై యుద్ధంలో మొదటి వరుస పోరాట యోధులుగా ఉన్న వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బంది, పారామెడికల్ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, శాస్త్రవేత్తలు, పోలీసులు, సాయుధ బలగాలతోపాటు రైతుల పాత్రను గుర్తుచేసుకున్న చైర్మన్, వారందరికీ అభినందనలు తెలియజేశారు.