కృష్ణా బోర్డు, కేంద్ర జల మంత్రిత్వ శాఖల అభ్యంతరాలను ఖాతరు చేయకుండా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి అదనంగా తీసుకునే నీటిని తరలించే ప్రాజెక్టు పనులను ఏపీ ప్రభుత్వం వేగం పెంచింది. నిప్పులవాగు విస్తరణతో పాటు కుందూ నదిపై రాజోలి, జోళదరాశి రిజర్వాయర్ల నిర్మాణ పనులకు టెండర్లు రెడీ చేసింది.
రూ.1,769.15 కోట్లతో చేపట్టే ఈ పనుల టెండర్ షెడ్యూళ్లను మంగళవారం నంద్యాల ఎస్ఈ ఏపీ జ్యుడీషియల్ ప్రివ్యూ ఆమోదం కోసం పంపారు. ఇప్పటికే సంగమేశ్వరం టెండర్ల ప్రక్రియ పూర్తి చేసిన ఏపీ సర్కారు నిప్పులవాగు, కుందూ, గాలేరు నగరిపై ఇప్పుడు ఫోకస్ పెట్టింది.
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కెపాసిటీని 44 వేల నుంచి 80 వేల క్యూసెక్కులకు పెంచుతున్నందున నిప్పుల వాగు నుంచి రోజుకు 3 టీఎంసీల నీటిని తరలించేలా పనులు చేపడుతున్నట్టు టెండర్ షెడ్యూళ్లలో పేర్కొన్నారు. బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ నుంచి ఎస్కేప్ చానల్ ద్వారా నిప్పులవాగుకు లింక్ చేసి దాని ద్వారా సోమశిల రిజర్వాయర్‌కు నీటిని తరలిస్తున్నారు.
రోజుకు 10 వేల క్యూసెక్కుల సామర్ధ్యం గల ఎస్కేప్ చానల్, నిప్పుల వాగు కెపాసిటీని 35 వేల క్యూసెక్కులకు పెంచుతున్నారు. బానకచర్ల క్రాస్ రెగ్యులేటర్ తర్వాత జీరో పాయింట్ నుంచి నిప్పులవాగు, గాలేరు, కుందూ నది 189.20 కి.మీ.ల వరకు విస్తరణ పనులు చేపట్టనున్నారు.
గ్రామాలకు రవాణా సౌకర్యం కోసం హైలెవల్ బ్రిడ్జిలు కూడా నిర్మించాల్సి ఉంటుందని టెండర్ ఫారంలో పేర్కొన్నారు. ఈ పనులకు రూ.1,254.73 కోట్లతో టెండర్లు పిలిచారు. నిప్పులవాగు నుంచి తరలించే నీటిని నిల్వ చేసేందుకు కర్నూల్ జిల్లా
చాగలమర్రి మండలం రాజోలి దగ్గర రిజర్వాయర్ నిర్మించేందుకు రెండో టెండర్ నోటీస్ ఇచ్చారు.
కుందూ నదిపై 2.95 టీఎంసీల కెపాసిటీతో నిర్మించే రిజర్వాయర్‌కు రూ.306.46 కోట్లతో టెండర్ పిలిచారు. ఈ పనిని 36 నెలల్లో పూర్తి చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కుందూ నదిపైనే కర్నూల్ జిల్లా కోయిల్‌కుంట్ల మండలం జోళదరాశి వద్ద 0.80 టీఎంసీల కెపాసిటీతో నిర్మించే మరో రిజర్వాయర్‌కు రూ.207.95 కోట్లతో టెండర్ పిలిచారు. ఈ పనులను 24 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
More Stories
విశాఖ ఉక్కు కాపాడుకుందాం
22న కృష్ణాతీరంలో 5వేల డ్రోన్ల ప్రదర్శన
రేణిగుంట విమానాశ్రయానికి బాంబు బెదిరింపు