కేంద్ర హోంమంత్రితో సీఎం జగన్ భేటీ  

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం సాయంత్రం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాతో సమావేశమయ్యారు. సాయంత్రం గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఢిల్లీ చేరుకున్న జగన్‌ కేంద్రమంత్రిని ఆయన నివాసంలో కలిశారు. . దాదాపు గంటపాటు ఈ భేటీ జరిగినట్టు తెలిసింది.
ఈ సందర్భంగా రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్‌ నిధులతో పాటు రాష్ట్ర విభజన చట్టంలోని హామీల అమలు, పోలవరం, కొవిడ్‌ సహా పలు కీలక అంశాలపై జగన్‌ చర్చించినట్లు సమాచారం. అలాగే ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తున్నది. 
 
ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టంలోని నిబంధనల ద్వారా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కేంద్రం నుంచి అందాల్సిన సాయంపై చర్చించినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వీటితోపాటు దిశ చట్టం, శాసన మండలి రద్దు.. చట్ట రూపు దాల్చే ప్రక్రియను వేగవంతం చేయాలని కోరినట్టు ఆ వర్గాలు తెలిపాయి.   
 
 పోలవరం ప్రాజెక్టుకు వెచ్చించిన రూ.4 వేల కోట్ల మేర రీయింబర్స్‌ చేయాలని, పునరావాస సాయం త్వరితగతిన అందించాలని కోరనున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.  
మరోవైపు, రాజధాని వికేంద్రీకరణ విషయంలో ఇటీవల కేంద్ర హోంశాఖ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ల అంశంపైనా కూడా చర్చిస్తున్నట్లు చెబుతున్నారు. జగన్‌ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి ఉన్నారు. అలాగే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌తో ఏపీ సీఎం భేటీకానున్నారు.