నోయిడా పరిసరాల్లో భారీ ఫిలిం సిటీ  

నోయిడా పరిసరాల్లో దేశంలోనే అతిపెద్ద ఫిలిం సిటీ  ఏర్పాటు చేయడానికి ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వేగంగా అడుగులు వేస్తున్నారు.యోగి ఆదిత్యనాథ్ మంగళవారం ప్రముఖ సినీ నిర్మాతలతో సమావేశమై దేశానికి సాంస్కృతిక కేంద్రంగా ఉత్తర ప్రదేశ్ నిలిచేందుకు ఉన్న అవకాశాలను సినీ నిర్మాతలకు వివరించారు. 
 
ఉత్తర ప్రదేశ్ సరిహద్దుల్లో 7 రాష్ట్రాలు, నేపాల్ ఉన్నట్లు తెలిపారు. తమ రాష్ట్రం యావత్తు దేశానికి సాంస్కృతిక కేంద్రమని చెప్పారు. ప్రపంచంలో ప్రాచీన నగరం వారణాసి, శ్రీరాముని జన్మస్థలం అయోధ్య తమ రాష్ట్రంలోనే ఉన్నాయని గుర్తు చేశారు. 

చారిత్రక నగరం హస్తినాపురం సమీపంలో నూతన ఫిలిం సిటీని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినట్లు తెలిపారు. దీని కోసం భూమిని కూడా గుర్తించామని వెల్లడించారు. హస్తినాపురానికి మన దేశ చరిత్రలో గొప్ప పేరు ఉందని చెప్పారు. 

రాష్ట్రంలో 7 విమానాశ్రయాలు ఉన్నాయని, మరొక ఇరవైకి పైగా విమానాశ్రయాల నిర్మాణానికి పనులు జరుగుతున్నాయని చెప్పారు. పవిత్రమైన గంగ, యమున నదుల మధ్యలో ఈ ఫిలిం సిటీ వస్తుందని తెలిపారు. 

జేవర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తున్నామని, దీనికి మెట్రో సర్వీసుతో అనుసంధానం చేస్తామని చెప్పారు. ఈ ఫిలిం సిటీ పరిసరాల్లోనే ప్రపంచ స్థాయి ఎలక్ట్రానిక్, ఫైనాన్షియల్ సిటీ నిర్మాణానికి ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు.