లక్ష సీఏఆర్-816 రైఫిళ్ల తయారీ      

లక్ష సీఏఆర్-816 రైఫిళ్ల తయారీ      

‘మేక్ ఇన్ ఇండియా’లో భాగంగా దేశంలో సుమారు లక్ష సీఏఆర్-816 రైఫిళ్ల తయారీ చేపట్టనున్నట్టు యూఏఈ కి చెందిన ఆయుధాల తయారీ సంస్థ కారకల్ వెల్లడించింది. అసాల్ట్ రైఫిల్స్ సరఫరాను వేగంగా అందించడానికి మేక్ ఇన్ ఇండియా చొరవకు తాము కట్టుబడి ఉన్నామని ప్రకటించారు.

భారత సైన్యానికి అసాల్ట్ రైఫిల్స్ సరఫరా చేయడానికి ఈ సంస్థను భారత రక్షణ మంత్రిత్వ శాఖ 2018 లో ఎంపిక చేసింది. సీఏఆర్- 816 లో అమర్చే 20 శాతం విడిభాగాలు ఇప్పటికే భారతదేశంలో తయారయ్యాయి, ‘మేక్ ఇన్ ఇండియా’ చొరవతో కారకల్ సంస్థ ఇప్పుడు దేశంలో రైఫిల్స్‌ను పూర్తిగా తయారు చేయడానికి నిబద్ధతను కలిగి ఉంది.

ఉత్పత్తిని వెంటనే ప్రారంభించటానికి అవసరమైన భూమి, ఇతర సౌకర్యాలు,  స్థానిక భాగస్వాములను తాము ఇప్పటికే గుర్తించామని కారకల్ సంస్థ పేర్కొన్నది. రెండేండ్ల క్రితం బిడ్‌ను గెలవడానికి పనితీరు, సాంకేతికత పరంగా తాము ఎందరో ప్రపంచ పోటీదారులను అధిగమించామని కంపెనీ పేర్కొన్నది.

ఇప్పుడు 12 నెలల్లో భారతదేశం నుంచి ఫాస్ట్ ట్రాక్ ఆర్డర్‌ను అందించడానికి సంసిద్ధతను ధృవీకరిస్తున్నట్లు వెల్లడించింది. “కఠినమైన ఎంపిక ప్రక్రియలో పాల్గొన్న తరువాత, భారత సైన్యానికి సీఏఆర్- 816 సరఫరా చేయడానికి 2018 లో క్లోజ్-క్వార్టర్ కార్బైన్ కాంట్రాక్ట్ లభించింది” అని కారకల్ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హమద్ అల్ అమెరి తెలిపారు.

సీఏఆర్- 816 కార్బైన్‌లు భారత సైన్యం యొక్క ప్రస్తుత 9ఎంఎం స్టెర్లింగ్ కార్బైన్‌లను భర్తీ చేయడానికి ఉద్దేశించబడ్డాయి. సీఏఆర్- 816 అధిక బుల్లెట్ వేగాన్ని కలిగి ఉంటుంది. స్టెర్లింగ్ కార్బైన్‌లతో పోలిస్తే బరువు తక్కువగా ఉంటుంది.

అసాల్ట్ రైఫిల్ మిడిల్ ఈస్ట్, యూరప్, ఆసియా వ్యాప్తంగా ఉన్న కస్టమర్ల నుంచి అనేక ఒప్పందాలను కలిగివున్నది. భారత సాంకేతిక అవసరాలకు అనుగుణంగా తాజా సాంకేతిక పురోగతులను కలుపుకొని ముందుకు సాగుతున్నది.