ఆదివారం ఘటనలపై వెంకయ్య ఆవేదన

పార్లమెంటు ఎగువసభలో ఆదివారం చోటుచేసుకున్న ఘటనల పట్ల రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్యనాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పరిస్థితులు రాజ్యసభ గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయని, రాజ్యసభ చరిత్రలో అదో దుర్దినం అని ఆయన పేర్కొన్నారు.

‘ఈ ఘటన నన్ను ఎంతగానో కలచివేసింది. అది దురదృష్టకరం, అనంగీకారం, ఖండించదగినది’ అని ఆయన సోమవారం తెలిపారు. కొందరు సభ్యులు.. కరోనా నేపథ్యంలో సురక్షిత దూరం పాటించాలన్న నిబంధలను ఉల్లంఘించించారని కూడా చైర్మన్ పేర్కొన్నారు.

‘మనమే కరోనా నిబంధనలను పాటించకపోతే.. సామాన్య ప్రజలు పాటించాలని ఎలా అనుకుంటాం?’ అని ప్రశ్నించారు. కొందరు సభ్యులు వెల్‌లోకి దూసుకువచ్చి పేపర్లు, రూల్ బుక్‌ను డిప్యూటీ చైర్మన్‌పై విసిరేసి ఆయన్ను దూషించిన విషయాన్ని చైర్మన్ గుర్తుచేశారు. మరికొందరు సెక్రటరీ జనరల్ బల్లపైకి ఎక్కి నినాదాలు చేస్తూ, గంతులు వేశారని, పేపర్లు చించేశారని,  మైకులు విరగ్గొట్టి డిప్యూటీ చైర్మన్‌ విధులకు ఆటంకం కలిగించారని విస్మయం వ్యక్తం చేశారు.

‘ఇదేనా పార్లమెంటరీ స్థాయి..దీనిపై సభ్యులు ఆత్మవిమర్శ చేసుకోవాలి’ అని చైర్మన్ కోరారు. ఆదివారం నాటి ఘటన పార్లమెంటు గౌరవానికి మరీ ముఖ్యంగా పెద్దల సభ మర్యాదకు భంగం కలిగించిందని స్పష్టం చేశారు. డిప్యూటీ చైర్మన్‌పై చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆదివారం నాటి సభాకార్యక్రమాలను తాను క్షుణ్ణంగా పరిశీలించానని ఆయన తెలిపారు.

వెల్‌లోకి వచ్చిన సభ్యులు సీట్లలోకి వెళ్లి కూర్చుంటే బిల్లుపై చర్చించి సవరణలు సూచించేందుకు వీలుంటుందని డిప్యూటీ చైర్మన్ పదే పదే పేర్కొన్న విషయం స్పష్టంగా కనబడుతోందని గుర్తు చేశారు.