భారీ వర్షాలతో వణుకుతున్న కర్నాటక

భారీ వర్షాలతో వణుకుతున్న కర్నాటక

కొన్నిరోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు కర్నాటకలోని తీరప్రాంతాలు తీవ్రంగా నష్టపోయాయి. ఉడుపి జిల్లాలోని కొన్ని గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి. రైతులు చేతికొచ్చిన పంటల్ని నష్టపోయారు. ఉడుపి పట్టణంలోనూ పలు కాలనీలు నీట మునిగాయి. 

బెంగళూరులోనూ లోతట్టు ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది వరదల వల్ల తమ రాష్ట్రానికి రూ.8071 కోట్లమేర నష్టం జరిగిందని యడియూరప్ప తెలిపారు.

ఆగస్టు 1 నుంచి 20మంది చనిపోయారని, వేలాదిమందిని పునరావాస కేంద్రాలకు తరలించామని, 10,000 ఇళ్లు ధ్వంసమయ్యాయని, 4.03 హెక్టార్లలో పంట నష్టం జరిగిందని ఆయన తెలిపారు. ఉడుపిలోని వరద ప్రాంతాలకు ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందాలను పంపాల్సిందిగా జిల్లా అధికారులను ఆదేశించానని ఆ రాష్ట్ర హోంమంత్రి బసవరాజ్‌బొమ్మై తెలిపారు. 

వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు ఎన్ డి ఆర్ ఎఫ్ బృందాలు కూడా రానున్నాయని ఆయన తెలిపారు. మల్నాడ్‌లోని కోస్తా జిల్లాల్లో మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని, అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రజలకు సూచించారు.