కదంబ అడవుల్లో ఎన్ కౌంటర్ పై  అనుమానాలు 

కదంబ అడవుల్లో ఎన్ కౌంటర్ పై  అనుమానాలు 
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం కదంబ అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శనివారం రాత్రి ఎన్ కౌంటర్ లో ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండకు చెందిన జుగున్నాక బాదిరావు, చత్తీస్​గఢ్​కు చెందిన చుక్కాలు మృతిచెందారు. 
 
వీరు ఆడెల్లు టీమ్​సభ్యులు కాదని,  వేరేచోటు నుంచి పోలీసులు పట్టుకొచ్చి హతమార్చారనే ప్రచారం జరుగుతోంది. జిల్లా కార్యదర్శి మైలారపు ఆడెల్లు అలియాస్ భాస్కర్ సైతం ఈ ఎన్ కౌంటర్ బోగస్ అని పత్రికాప్రకటన విడుదల చేశారు. మరోవంక పోలీసుల భిన్న ప్రకటనలు అనుమానాలను మరింత పెంచుతున్నాయి. 
 
ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాలో భాస్కర్ నేతృత్వంలో నలుగురు మావోయిస్టులు మాత్రమే పని చేస్తున్నారని, కొత్త రిక్రూట్ మెంట్లు ఏమీ జరగలేదని జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి జులై 17న వెల్లడించడం గమనార్హం.  అప్పట్లో పోలీస్ ఆఫీసర్లు ప్రకటించిన జాబితాలో తాజాగా ఎన్ కౌంటర్ లో చనిపోయిన ఇద్దరి పేర్లు లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. 
 
కాగా తాజా ఎన్​కౌంటర్​ తర్వాత పోలీసులు మాత్రం వాళ్లిద్దరూ ఆడెల్లు నేతృత్వంలోని దళ సభ్యులే అని చెబుతున్నారు. డీజీపీతో సహా మొదట్లో ఆడెల్లు టీమ్​లో ఐదుగురు సభ్యులే ఉన్నారని చెప్పిన పోలీసులు తాజా ఎన్ కౌంటర్ అనంతరం ఏడుగురు అని పేర్కొనడం గమనార్హం.  ఒకవేళ వీళ్లిద్దరూ నిజంగా దళ సభ్యులే అయితే కొత్తగా జరిగిన రిక్రూట్ మెంట్ల విషయాన్ని  పోలీసులు దాచిపెట్టారని భావించాల్సి వస్తోంది. 
 
 నిజానికి గత ఆరు నెలల కాలంలో పలువురు కొత్త సభ్యులు దళంలో చేరినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే గడిచిన మూడు నెలల వ్యవధిలో  రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి ఏకంగా రెండుసార్లు జిల్లాలో పర్యటించారు.
 
మరోవంక, చనిపోయిన ఇద్దరూ సివిల్ డ్రెస్సుల్లో,  నైట్​ప్యాంట్లు వేసుకొని ఉన్నారు. ఆడెల్లు టీమ్​ కోసం 500 మంది పోలీసులు సుమారు మూడు నెలలుగా గాలిస్తున్నారు. ఈ క్రమంలో అడవుల్లో తిరుగుతున్న దళసభ్యులు యూనిఫామ్​లో కాకుండా సివిల్ డ్రెస్​లో ఎందుకు ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాదీరావు ఏకంగా తెలుపు రంగు అంగీ తొడుక్కున్నాడు. ఎక్కడినుంచైనా అగుపడే ఇలాంటి చొక్కాను మావోయిస్టులు అస్సలు వేసుకోరని చెబుతున్నారు.